Pages

Thursday, February 9, 2012

రచ్చ గెలిచి ....ఇంట తెలియని మా వూరి వేణువు



 ఇంతకు ముందు వ్యాసంలో ఏల్చూరి విజయ రాఘవరావు గారి గురించి కొంత సమాచారాన్నిసేకరించి పొందు పరచగలిగాను. ఆ వ్యాసం చూశాక, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారుడు శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు మరిన్ని విశేషాలను, అరుదైన ఫొటోలను (వారి ఫామిలీ ఆల్బం లోంచి) ప్రచురణార్థం అందజేశారు. అవి చేరిస్తే ఆ వ్యాసం మరింత విస్తరించే అవకాశం ఉన్నందుకు మరో బ్లాగ్ పోస్టులో వాటిని పొందుపరుస్తున్నాను.

ఆయన కూడా నరసరావుపేట ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థి. అక్కడ మహాకవి శ్రీనాయని సుబ్బారావు గారి శిష్యులు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలిగా పనిచేసినప్రఖ్యాత విద్వత్కవయిత్రి డా. నాయని కృష్ణకుమారి గారు వీరికి సహాధ్యాయిని.

 
వీరు 1942లో నరసరావుపేటలో తమ అన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారిఅధ్యక్షతను వెలసిన “నవ్యకళాపరిషత్తు”లో తొలితరం సభ్యులు. అన్నగారి ప్రాణమిత్రులైన రెంటాలగోపాలకృష్ణ గారు, అనిసెట్టిసుబ్బారావు గారు, మాదల వీరభద్రరావు గారు, శ్రీ మునిపల్లెరాజు గారు, చలనచిత్ర దర్శకులు గిడుతూరిసూర్యం గారు వీరికీ చిన్నప్పటి నుంచి కూర్మినెచ్చెలులు. సంగీత సాధనకు సమస్కంధంగాకవితారచనతోపాటు కథలు కూడా వ్రాశారు.

ఒకనాటి అరసం నడిపిన “అభ్యుదయ”; కొల్లా వెంకయ్య గారి “పొగాకులోకం”;
సూర్యదేవరరాజ్యలక్ష్మి గారి “తెలుగుదేశం”;
సెట్టి ఈశ్వరరావు గారుప్రారంభించి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చివేసినమునుపటి “విశాలాంధ్ర”
మొదలైన పత్త్రికలలో వీరి రచనలనేకం కనబడతాయి.

పెద్దయాక “అంతర్వాణి”,  “అభ్యుత్థానం”,విజయాంజలి” మొదలైన కవితా సంపుటాలను, మూడు కథాసంపుటాలను, “స్వప్నజనితరాగాలు” అనే గేయ, కథారచనల సంకలనాన్ని, సుందరకాండ గేయ అనువాదాన్ని ప్రచురించారు.




ఇంగ్లీషులో వీరి “నిర్వాణ అండ్అదర్ పోయమ్స్” అనే సంపుటానికి అమెరికాలో ఉత్తమ కవిగా దేశీయ పురస్కారం వచ్చింది.  తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ భాషలలోపాండిత్యాన్ని సంపాదించటమే గాక ఆ భాషలలో పెక్కు రచనలు చేశారు. ఆ అన్ని భాషల రచనా సమాహారంగాఒక అద్భుతమైన సంగీత వాద్యబృంద కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచమంతటా ప్రదర్శించారు.

    
శ్రీయుత  విజయరాఘవరావు గారి సంగీతవిజయాలు అసంఖ్యేయాలు. రిచర్డ్ ఆటెన్ బరో గారి "గాంధీ" ఆంగ్లచిత్రానికిఆయన సంగీతం సమకూర్చిన సంగతి, అందులోని మనసులకు హత్తుకొనిపోయే ఫ్లూట్ బిట్ విషయం చాలామందికి తెలియదు. ఆ చిత్రనిర్మాణంతర్వాత శ్రీ ఆటెన్ బరో గారు వీరి ప్రతిభను మెచ్చుకొంటూ వ్రాసిన లేఖ ఒక జాతీయ పురస్కారానికన్నాఎంతో విలువైన దనిపిస్తుంది.

మృణాళ్ సేన్ గారి "భువన్ షోమ్" చిత్రానికిజాతీయ సంగీత దర్శకునిగా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకోవటం; ఎం.ఎఫ్. హుసేన్ గారు నిర్మించిన అజరామరమైన దృశ్యకావ్యం  "Through the eyes of a painter "చిత్రానికి ఆయన అంతర్జాతీయ గోల్డెన్ బేర్ సంగీత దర్శక పురస్కారాన్నిగెలుపొందటం; రుడ్యార్డ్కిప్లింగ్ "జంగిల్బుక్" చిత్రానికి సంగీత రచన; తెలుగులో మృణాళ్ సేన్ గారి "ఒక వూరి కథ"కుఇచ్చిన అద్భుతమైన సంగీతం;"రెయిన్ బో" సంగీత ప్రయోగం; జెకోస్లావియన్ భారతీయ-పాశ్చాత్య సంహితాత్మక సంగీత సమ్మేళనాలు; ఆయన కనిపెట్టినహిందూస్తానీ కొత్త రాగాలు వంటివి ఇంటర్నెట్ లో లేకపోవటం వల్ల చాలా విశేషాలు ఈనాటి యువతీ యౌవనులకు తెలియకపోవటంలో ఆశ్చర్యంలేదు.


పండిట్ రవిశంకర్ గారు కోరికపై ఆయన స్థాపించినదే ఢిల్లీలో మండీ హౌస్ వద్ద వెలసిన త్రివేణీ కళా సంగమ్ భవనం. కవిగా ఆయన సాహిత్య విజయాలు, అమెరికాలో ఉత్తమఆంగ్లకవిగా పొందిన పురస్కారాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు "గానకళాప్రపూర్ణ' పురస్కారాన్ని అందుకోవటం; ఆయనఅభిమానులైన దేశ విదేశాలలోని రసజ్ఞులు కురిపించిన ప్రశంసా వర్షా వాక్యావళిని ఉదాహరిస్తేఅదొక విజ్ఞాన సర్వస్వం అవుతుంది. పాల్ మెకార్త్నీ, యెహూదీ మెనూహిన్, పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అల్లా రఖా, వారి తనయులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శ్రీ ఉదయ్ శంకర్, సత్యజిత్ రే, మృణాళ్ సేన్ వంటి మహామహు లందఱూ వీరికిఆత్మీయులు.

గొప్ప వక్త; సరస సల్లాపకోవిదాగ్రణి. ప్రపంచమంతటా పర్యటించి భారతీయ సంగీతాన్ని, తెలుగు భాషను దిగంతాలలో పరిమళింపజేశారు.


వీరి అన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు 1944 ఆగస్టులో కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసులతో కలిసి తెలుగులో అచ్చైనతొలి వచన కవితా సంకలనం “నయాగరా”ను వెలువరించారు. వీరి సహధర్మచారిణి లక్ష్మి గారు కూడాకర్ణాటక-హిందూస్తానీ వేణువాదన నిపుణురాలు.  వీరి బావగారు కీ.శే. దుగ్గిరాల రామారావు గారు ఏలూరులోఉండేవారు. ఆకాశవాణిలో “ఎ” గ్రేడు ఆర్టిస్టుగా గుర్తింపును పొందిన ప్రముఖ వేణువాదన విద్వాంసులు. బావమఱది శ్రీ దుగ్గిరాల సుబ్బారావు గారు డి.ఎస్.రావుగా విఖ్యాతులు. కేంద్ర సాహిత్య అకాడెమీ సెక్రెటరీగా పదవీ విరమణ చేసి, విద్యారంగం లోనికి ప్రవేశించి, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనేఅత్యుత్తమ ఆంగ్లోపాధ్యాయునిగా మన్నన గడించారు. వారు కూడా ప్రఖ్యాత ఆంగ్ల భాషా రచయిత, గ్రంథకర్త; త్రిపురనేని గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర”ను, ఇంకా అనేక ఇతర విదిత నవలలను తెలుగు నుంచి ఆంగ్లానువాదాలు చేసిన కోవిదులు.అమెరికాలో ఉన్నారు.


శ్రీ విజయరాఘవరావు గారి జ్యేష్ఠ తనయుడు విజయవర్ధన్ విజ్ఞాన శాస్త్రవేత్త అయినప్పటికీతండ్రి వద్దనే వేణుగానం అభ్యసించారు. కచేరీలు చేశారు. చిన్న కొడుకు సంజయ్ కె. రావుకూడా అమెరికాలో పారిశ్రామికవేత్తగా గుర్తింపును పొందినా తండ్రి వద్దనే తబలా అభ్యసించినసంగీతకోవిదుడు. పెక్కు అంతర్జాతీయ వాద్యబృంద కార్యక్రమాలను నిర్వహించారు. డాక్యుమెంటరీచిత్రనిర్మాత.


ప్రఖ్యాత కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు “తిరణాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా”అని వ్రాసిన అందమైన గీతానికి శ్రీ విజయరాఘవరావు గారు ముగ్ధులై, ఆశువుగా రాగాన్ని కట్టి విజయవాడ ఆలిండియా రేడియోలోరికార్డింగు చేస్తుంటే ఆ చిరస్మరణీయమైన దృశ్యాన్ని “రామం” గా వివిధభారతి రేడియో అభిమానులగుండెలలో గుడికట్టుకొన్న శ్రీ ఎస్.బి. శ్రీరామమూర్తి గారు “ఒక పాట పుట్టింది” అన్నరమణీయమైన శబ్దచిత్రకావ్యంగా మలిచారు. విఖ్యాత చాయాచిత్రగ్రాహకులు శ్రీ జితేంద్ర ఆర్యగారువీరి చిత్రాలను తీసి తమ సంకలనంలో చేర్చుకొన్నారు.  



విజయరాఘవరావు గారు తమ గురువులైన పండిత రవిశంకర్ గారితో ఢిల్లీ ఆకాశవాణిలో చేరి, వేణువాద్యనిపుణునిగా ప్రతిష్ఠాత్మకములైన పెక్కు జాతీయ కార్యక్రమాలలో పాలుపంచుకొన్నారు. ఆకాశవాణి పురస్కారాలను పొందారు. ఈమని శంకరశాస్త్రి గారు, కామశాస్త్రి గారు, నల్లాన్ చక్రవర్తుల జగన్నాథాచార్యులు గారు మొదలైన పెద్దలతో వాద్యబృంద సమ్మేళనాలను నిర్వహించారు.

ఆ తర్వాత బొంబాయి వెళ్ళి ఫిలిమ్స్ డివిజన్ లో దర్శకత్వ బాధ్యతను స్వీకరించి మూడు దశాబ్దుల కాలంలో వందలాది డాక్యుమెంటరీలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరి శిష్యులు హిందీ చలనచిత్రాలలో చేరినా, పెక్కుమార్లు ఆహ్వానాలు, ఒత్తిడులు వచ్చినా, ఎట్టి ప్రలోభాలకూ లొంగక శాస్త్రీయ సంగీతానికి పరిమితమై వాణిజ్య కళకు దూరంగా ఉండిపోయారు.

"జనగణమన" జాతీయగీతానికి వీరూ ఒక రాగనిర్దేశం చేశారని చాలామందికి తెలియదు. ఆ గీతానికి వివిధ రాగాల సముచ్చయాన్ని చారిత్రకంగా విశ్లేషించిన ఒక డాక్యుమెంటరీకి వీరు దర్శకత్వం కూడా వహించారు. "ఏషియాడ్" క్రీడోత్సవాలు తొలిసారి ఢిల్లీలో జరిగినప్పుడు పండిత నరేంద్రశర్మ గారి "స్వాగతం, శుభస్వాగతం" అన్న గీతికకు వీరి
సంగీతం చాలా ప్రాచుర్యాన్ని పొందింది. 
మంచి రూపసి కావడం వల్ల ఒకటి రెండు పర్యాయాలు సంగీత ప్రధానములైన తెలుగు చిత్రాలలో ప్రధాన భూమికకు వీరిని ఆయా చిత్రనిర్మాతలు   కోరినా, ఆ విధమైన ఆసక్తి లేక వీరు అంగీకరింపలేదు.  

3 comments:

వేణు said...

మురళీధరరావు గారూ!

విశిష్టమైన మీ ప్రౌఢ శైలిలో ఈ వ్యాసం చదవటం మంచి అనుభవం. విజయరాఘవరావు గారి గురించి ఎన్నో కొత్త విశేషాలు తెలిశాయి. అటెన్ బరో ‘గాంధీ’, మృళాన్ సేన్ ‘ఒక ఊరి కథ’, ఎంఎఫ్ హుస్సేన్ చిత్రాలకు ఆయన సంగీతం అందించారని నాతో పాటు ఎందరో పాఠకులకు ఇప్పటిదాకా తెలియదు. ఆయన సాహిత్య, సంగీత విజయాల గురించి చదువుతుంటే అబ్బురంగా ఉంది.

ఆయన బహుముఖ ప్రజ్ఞ మన రాష్ట్రంలో పెద్దగా తెలియకుండా పోవటం విచారకరం. విజయరాఘవరావు గారు జీవించివున్నపుడే మీరు ఇలాంటి వ్యాసం ఎందుకు రాయలేదా అని మిమ్మల్ని నిలదీయాలనిపిస్తోంది!

PS : గాంధీ సినిమాలో మీరు పేర్కొన్న ‘మనసులకు హత్తుకొనిపోయే ఫ్లూట్ బిట్’ తెలుగు అనువాద చిత్రం (రచయిత్రి ఓల్గా అనువదించిన సినిమా) లో కూడా ఉండే ఉంటుంది కదా? ఆ సీడీ సంపాదించి ఎలాగైనా ఆ బిట్ వినాలి!

సుజాత వేల్పూరి said...

మురళీధర్ రావు గారు ఇలా అన్నారు !

మాన్యులు శ్రీ వేణు గారికి,




ఆత్మీయతాఘట్టితమైన మీ సుహృల్లేఖ “ఇట్లుతగునా?” అన్న ధూర్జటి మహాకవి శీర్షణ్యవాక్యాన్ని సద్యఃస్ఫురణకు తెచ్చి, ఈ వివృతిరూపనిష్కృతిని వ్రాయాలనిపించింది.





చిన్ననాడు మేమొక అపురూపమైన వాతావరణంలోపెరుగుతున్నామన్న అభిజ్ఞానం మాకెన్నడూ కలుగలేదు. మహనీయులైన పెద్దల సన్నిధిరూపమైన పెన్నిధిమాకు కైవసమని ఆ రోజుల్లో తెలియనే లేదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు,విశ్వనాథ సత్యనారాయణ, విశ్వనాథ అచ్యుతదేవరాయలు, విశ్వనాథ విశ్వనాథరాయలు, రాయప్రోలు సుబ్బారావు, తాపీ ధర్మారావు గారు, తాపీ మోహనరావు గారు, తాపీ చాణక్య, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి, డా. సి. నారాయణరెడ్డి గారు, అనిసెట్టి సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, అజంతా, గంగినేని వెంకటేశ్వరావు, పోలూరి ఆంజనేయప్రసాద్, కేశవతీర్థస్వామి, రెంటాల గోపాలకృష్ణ, శ్రీశ్రీ,ఆరుద్ర, మద్దిపట్ల సూరి, సెట్టి ఈశ్వరరావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, మహీధర రామమోహనరావు, రాయప్రోలు రాజశేఖర్, కవిరాజమూర్తి, నాయని సుబ్బారావు, ఏటుకూరి బలరామమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, తాపీ రాజమ్మ గారు, పాలగుమ్మి పద్మరాజు, బిట్రగుంట రామచంద్రరావు గారు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మండలీక సుబ్బారావు గారు, కొంగర జగ్గయ్య గారు, గొల్లపూడి మారుతీరావు గారు, దాశరథి, కోట వీరాంజనేయశర్మ, దివాకర్లవేంకటావధాని, శ్రీ అద్వయానందస్వామిగా సన్న్యసించిన మహామతి తుమ్మలపల్లిరామలింగేశ్వరరావు, కొడవటిగంటికుటుంబరావు, “చందమామ” పత్త్రికకు ఆ పేరుపెట్టిన బలుసుపాలెం రామారావుగారు, దాసరి సుబ్రహ్మణ్యం, గిడుతూరి సూర్యం, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఛాయాదేవి దంపతులు, అబ్బూరి రామకృష్ణారావుగారు, ధనికొండ హనుమంతరావు గారు, ధనికొండ శ్రీధరరావు గారు, శతావధాని కోట సత్యరంగయ్యశర్మగారు, డా. గాలి బాలసుందరరావు గారు, తిమ్మావజ్ఝలకోదండరామయ్యగారు, వావిళ్ళ వారు, నిడుదవోలువేంకటరావు, పప్పు వేణుగోపాలరావు గారు, చెఱుకుపల్లిజమదగ్నిశర్మ గారు, ఆధునికయుగంలో తొలి శతావధాని మాడభూషి వేంకటాచార్యులవారివంశీయులు మఱొక అవధాని మాడభూషి వేంకటాచార్యులు గారు, కలియుగార్జునశ్రీ గుండవరపు అప్పారావు గారి సంతతి, డి.వి. నరసరాజు గారు, ఎన్.ఆర్. చందూర్ గారు, టి.వి.కె. శాస్త్రి గారు, ఉపద్రష్ట సంగమేశ గురుదేవులు, సాలూరి రాజేశ్వరరావు, కె.యస్. ప్రకాశరావు, ఏడిద నాగేశ్వరరావు, పెక్కుమంది సినీ నిర్మాతలు, ప్రసిద్ధ నటీనటులు, ప్రముఖ చిత్రకారులు, శ్రీ రామోజీరావు గారివంటి పత్త్రికాధిపతులు, మా యింటికి వచ్చినపుడు, మా యింటిలోనే అనేక కవిసమ్మేళనాలు, అభ్యుదయ – అరసం సమావేశాలు, చలనచిత్రకథా సంభాషణలు జరిగినప్పుడు, వారందరూ తఱచు మాఅమ్మ, బామ్మగారల ఆతిథ్యాన్ని స్వీకరించినపుడు, మేము అనునిత్యం వారిండ్లకు రాకపోకలు సాగించినపుడు; మాబాబాయిగారితో ఒక మహామహుడని కాక మా బాబాయిగారుగా అంత సన్నిహితంగా మెలగినప్పుడు, వారు మా యింటికి వచ్చినపుడల్లా వారికోసమో, వారితోనోవిచ్చేసి వి. రాఘవన్, మృణాల్ సేన్, కె.వాసుదేవరావు, వేణువాదకులు ఎన్. రమణి, వీణచిట్టిబాబు, సావిత్రి, కాంచన, ముళ్ళపూడి వెంకటరమణ వంటి మాన్యులు మా యింట్లో కూర్చొని గోష్ఠీవినోదాలు నెఱపినప్పుడు; మా నాన్నగారికి కాలేజీలో ఒక యేడాది జూనియర్ అయినందువల్ల యన్.టి. రామారావుగారుఆయనను సినిమా పాటలు వ్రాయమని బలవంతపెట్టినప్పుడు – అవేవీ అపురూపమైన ఘటనలని గాని; మా బాల్యం ఆ సంగీత సాహిత్యాల మధ్య గడిచిపోతున్నదని కాని; నేను విద్యార్థిగా, శిష్యునిగా, ఏతత్కుటుంబసభ్యునిగా శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారింటిలో ఉండి చదువుకొన్నపుడు; వారి మిత్రులందరినీ కలుసుకొన్నపుడు – నేనొక చరిత్రాత్మకమైన వాతావరణంలో ఉన్నానన్నఅభిజ్ఞానం నాకు, మా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకుఎన్నడూ కలుగనే లేదు.





ఆ పెద్దల మాటలు, వారి లేఖలు, ఆ జ్ఞాపకాలు మా మనస్సులలో వెలలేని సంస్కార ముద్రలను నిలుపుతున్నాయని గుర్తింపనే లేకపోయాము. మా నాన్నగారితో గడిపిన రోజులన్నీ - మధ్యాహ్నం సూర్యుడుండగా నిద్రపోయి, సాయంకాలం లేచి చీకటి పడుతున్నదని చింతించినవాడి కథలో లాగా ఇప్పుడనిపిస్తున్నది.





ఇవి వ్రాయాలని ఎన్నడూ అనుకోలేదు. శ్రీమతిసుజాత గారి వ్యాసానికి అదనపు సమాచారంగా ఆమె తన అభిలేఖితంలో జోడింపవచ్చునని పంపగా –ఆమె సహృదయంతో దానిని తమ వ్యాసభాగంలోనే పొందుపఱచటం జరిగింది. వారే నా కంప్యూటరుకు తెలుగు నేర్పి,ఇటీవలి నా రచనలకు కారణమైనారు. అదే మీ విలేఖనకు హేతువయింది.

వేణు said...

మురళీధర రావు గారూ!

మీ వివరణాత్మకమైన వ్యాఖ్య హృద్యంగా ఉంది. అంతటి సాహితీ, కళా వాతావరణంలో పెరగటం అపురూపమే. Insider గా ఉన్నపుడు దాని ప్రత్యేకతను గుర్తించకపోవడం కూడా సహజమే కదా!
ఇంతకీ నా వ్యాఖ్య ఇంతమంది మహామహులతో మీ అనుబంధాన్ని స్మరించుకునేలా చేసిందన్నమాట!

>> మధ్యాహ్నం సూర్యుడుండగా నిద్రపోయి, సాయంకాలం లేచి చీకటి పడుతున్నదని చింతించినవాడి కథలో లాగా ...>>
ఈ కథ ఏమిటో తెలియదు కానీ, మీ పోలిక ఎంతో బాగుందండీ.

>> “చందమామ” పత్త్రికకు ఆ పేరుపెట్టిన బలుసుపాలెం రామారావుగారు.. >>
ఇది నాకు తెలియని కొత్త విషయం. బహుశా ‘చందమామ’ అభిమానులందరికీ కూడా!