Pages

Thursday, February 23, 2012

కోటప్ప కొండ తిరణాల ..!!


పండగలెన్ని ఉన్నా,మూల నున్న ముసలమ్మను కూడా కుక్కి మంచంలోంచి లేపి పరుగులు పెట్టించే పండగ__

మా వూళ్ళో..మహాశివరాత్రి!
వారం ముందు నుంచే హడావుడి మొదలు.

కోటప్ప కొండ తిరణాల చూడాలని ఊళ్ళ నుంచి దిగే చుట్టాలూ, ఇంట్లో పిల్లలు కట్టే బుల్లి బుల్లి ప్రభలూ, తాడెత్తున లేచి ఆకాశాన్ని అంటుతాయేమో అన్నంతగా వూగి పోతూ ఎద్దుల బళ్ళ మీదా,(ఇప్పుడైతే ట్రాక్టర్ల మీద) కొండకేసి సాగే ప్రభలూ,ఊరంతా తిరణాల సందడీ, కొండ ముందు ఎకరాల కొద్దీ విస్తరించిన అంగళ్ళూ,గుట్టలు గుట్టలుగా చెరుకు  గడలూ,పసుపు కుంకుమలు కలిపిన బకెట్లతో మెట్ల పూజ చేస్తూ నడుం పడిపోతున్నా పట్టించుకోకుండా కొండెక్కే దంపతులూ...పండంగంతా మా వూర్లోనే!



త్రికూట పర్వతం మీద కొలువైన త్రికూటేశ్వరుడి పండగ శివరాత్రి. ఈ దేవుడంటే చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరికీ కొండంత భక్తి! అందుకే ప్రతి ఇంట్లోనూ ఒక కోటేశ్వర్రావు ఉంటాడు.:-))

దశాబ్దాల క్రితం, గుంటూరు వైపు నుంచి వచ్చే రైళ్ళన్నీ కోటప్ప కొండ సందర్శకులతో నిండిపోవడమే కాక రైలు పైన కూడా ఎక్కి ప్రయాణించే పరిస్థితి ఉండేదట. చుట్టు పక్కల మరి కొన్ని గ్రామాల్లో స్థానిక పండగల సందర్భంగా తిరణాలలు జరిగినా ఈ స్థాయిలో భారీ ఎత్తున లక్షల్లో భక్తులు తరలి  రావడం ఇక్కడే ప్రత్యేకం!

కోటప్ప కొండ చరిత్ర

దక్ష యజ్ఞంముగిశాక మహాదేవుడు శాంతించి దక్షిణా మూర్తి రూపంలో కోటప్ప కొండ మీద అవతరించాడట. బ్రహ్మాదులు   దక్షిణా మూర్తిని  బ్రహ్మోపదేశం చేయమని కోరగా ఆయన సమ్మతించి త్రికూటాద్రి పర్వతం మీద వారికి బ్రహ్మోపదేశం చేశాడని చెప్తారు. మూడు శిఖరాలు కల్గిన పర్వతం కావడంతో ఈ కొండని త్రికూట పర్వతమని పిలుస్తారు.



బ్రహ్మ,రుద్ర,విష్ణు శిఖరాలే ఈ త్రికూటాలు. రుద్ర శిఖరం మీదే శివుడు బ్రహ్మోపదేశం చేశాడని భావిస్తారు. ఈ శిఖరం మీదే కోటేశ్వర స్వామి పురాతన ఆలయం ఉంది. పక్కనే ఉన్న విష్ణు శిఖరం మీద విష్ణువు శివుడి గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో ఒక రాతి మీద పోటు వేశాడని, అక్కడ జల ఉద్భవించిందని నమ్మకం. అక్కడ పాప వినాశనేశ్వర ఆలయం నిర్మించారు.




ఇక్కడికి దగ్గరలోని యల్లమంద (మునిమంద గ్రామమే కాలక్రమేణా యల్లమందగా మారిందని చెప్తారు)గ్రామంలో మునులు ఎంతోమంది నివసించేవారట.

స్థల పురాణం:

ఇక్కడ శివుడు పన్నెండేళ్ళ వటువుగా అవతరించడం వల్లను,  ఆయన బ్రహ్మచారి కావడం వల్లను,, ఇక్కడ కళ్యాణోత్సవం జరగదు,. ధ్వజ స్థంభం  కూడా లేదు.దగ్గరలోని యల్లమంద గ్రామంలో నివసించే సాలంకయ్య అనే గృహస్తు రుద్ర శిఖరం మీది స్వామికి రోజూ కొండ ఎక్కి వచ్చి పూజలు చేసేవాడు.కొన్నాళ్లకు ఒక జంగమ దేవర సాలంకయ్య ఇంటికి వచ్చి కొన్నాళ్ళు నివసించి అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయాడు.  సాలంకయ్య ఎంత వెదికినా ఫలితం లేకపోయింది.

                                                                 

ఇలా ఉండగా అక్కడికి దగ్గర్లోని కొండ కావూరులో ఒక ఇంట్లో ఆనందవల్లి (ఈమెనే గొల్ల భామ అంటారు)అనే ఆడపిల్ల   శివభక్తురాలై,పాత కోటేశ్వర స్వామిని రోజూ పూజించేది.ఆమెకు జంగమదేవర ప్రత్యక్షంగా కనిపించడంతో నిత్య పూజలు ప్రారంభించింది.ఎంత ఎండాకాలమైనా, గొల్లభామ రోజూ కొండ ఎక్కి జంగమయ్యకు అభిషేకాలు నిర్వహించేది.ఒకనాడు అభిషేకానికి తీర్థం తెచ్చి ఉంచి,మారేడు దళాలకోసం వెళ్ళగా, ఒక కాకి వచ్చి ఆ తీర్థాన్ని నేల పాలు చేయడంతో గొల్ల భామ కోపించి ఆ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందంటారు.కోటప్ప కొండ మీద కాకులు కనిపించకపోవడానికి ఈ శాపమే కారణమంటారు.


ఎన్ని పరీక్షలు పెట్టినా గొల్లభామ రోజూ శివుడిని పూజించేందుకు వస్తుండటంతో జంగమ దేవర ఒకరోజూ  "నేనే నీ ఇంటికి వస్తాను పద, అక్కడే నన్ను పూజిద్దువు గానీ"  అని ఆమె వెనుకే బయలు దేరాడు. ఎటువంటి పరిస్తితుల్లోనూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని ఆమెను ఆదేశించాడు.

ఆమె బయలు దేరాక వెనుక నుంచి భయంకరమైన ప్రళయ ధ్వనులు,ఎద్దుల గిట్టల చప్పుడు, అది దూసుకొస్తున్న శబ్దాలకు భయపడి కొంత దూరం వెళ్ళగానే గొల్ల భామ వెనుదిరిగి చూసింది. దాంతో ఆమె,జంగమ దేవర ఎక్కడివారక్కరే శిలలుగా మారిపోయారని కథనం! వారిద్దరికీ అదే ప్రదేశాల్లో సాలంకయ్య ఆలయాలు నిర్మించాడు.
                                                                           గొల్ల భామ ఆలయం


త్రికోటేశ్వరాలయానికి కాస్త దిగువగా గొల్లభామ ఆలయం ఉంటుంది. భక్తులు ముందుగా  గొల్ల భామనే దర్శించి ఆ పైనే కోటేశ్వరుడిని దర్శిస్తారు. శ్రావణ మాసంలో రుద్ర శిఖరం పైన,కార్తీక మాసంలో విష్ణు శిఖరం పైన, మహా లింగార్చన చేసి ఉపవాస జాగరణలు చేసిన వారికి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.



11 వ శతాబ్ది నాటికే ఇక్కడ ఆలయం ఉందని ఇక్కడ కొండ మీది శాసనాల వల్ల తెలుస్తుంది.చోళ రాజులకు పూర్వం నుంచే ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కిందట.ఇక్కడి బొచ్చు కోటేశ్వరుడికి తల నీలాలు మొక్కుబడిగా ఇస్తుంటారు.కొండ కింద ప్రసన్న కోటేశ్వరుడు,నీల కంఠేశ్వరుడు తదితర దేవాలయాలు ఉన్నాయి.

తిరణాల సంబరం:
పంటలు చేతికొచ్చే తరుణం కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పోటీలు పడి ప్రభలు కట్టుకుని కొండకు తరలి వస్తారు. ఎంత ఎత్తు ప్రభ కడితే అంత ప్రతిష్ట! అయితే ఎత్తయిన ప్రభను కొండ వరకూ సురక్షితంగా తీసుకు రావడం ఒక పెద్ద సవాలు.అందులోనూ విద్యుత్ ప్రభలైతే మరింత కష్టం. అందుకనే విద్యుత్ ప్రభలు వచ్చే మార్గాల్లో అన్ని హై టెన్షన్ తీగల్లోనూ విద్యుత్ నిలిపి వేస్తారు పండగ రోజు.


 ఇవాల్టి రోజున పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా ప్రభలు కట్టి కొండకు తరలి వచ్చే గ్రామాలున్నాయి. వీటి జోరు దశాబ్దం క్రితం తగ్గు ముఖం పట్టినా....అతి చక్కని ప్రభకు బహుమతులు కూడా దేవస్థానం ప్రకటిస్తూ ఉండటంతో  ఇటీవల మళ్ళీ పుంజుకుంది.


నకరికల్లు,దేచవరం,మాచవరం,గామాల పాడు,ఈపూరు,బొమ్మరాజు పల్లి,చిలకలూరిపేట వైపు నుంచి గోవిందపురం,అప్పాపురం,కమ్మవారి పాలెం ,కావూరు,అమీన్  సాహెబ్ పాలెం,అవిశాయపాలెం ఇంకా అనేక గ్రామాల నుంచి ప్రభలు 90 అడుగుల ఎత్తు తో అందంగా రూపు దిద్దుకుని కొండకు వస్తాయి.

వీటిలో 50 ఏళ్ళ నుంచి క్రమం తప్పక వస్తున్న ప్రభలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే! అప్పాపురం ప్రభ యాభై ఎల్ల నుంచి క్రమం తప్పక వస్తుందట.



ఆలయం అతి పురాతన కట్టడం అయినందున దాదాపు దశాబ్దం క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. మెట్ల దారిలో విశ్రాంతి మండపాలు నిర్మించారు. అర్థాంతరంగా ఆగిన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని స్వయంగా శివభక్తుడైన అప్పటి శాసన సభ్యుడు కోడెల శివ ప్రసాద్ పూనుకుని పూర్తి చేసి, కోటప్ప కొండ చరిత్రలో మైలు రాయిని పాతారు.

దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో 41 మలుపులుండగా వీటిలో 4 కీలకమైన మలుపులు ఉన్నాయి. మూడు కీలక శిఖరాల మీదా బ్రహ్మ విష్ణు,మహేశ్వరుల భారీ విగ్రహాలను, కొండ పైన, భారీ గణేశ ప్రతిమను ప్రతిష్టించారు.


చక్కని ప్రకృతి, సందర్శకులను సేద తీర్చేలా ఘాట్ రోడ్డుని తీర్చి దిద్దారు. పచ్చని వృక్షాలు,పార్కులు,సెలయేళ్ళు,ఆట స్థలాలు ఈ రోడ్డులో కొలువు తీరాయి.



ఏటా జరిగే తిరణాల లో కోట్ల రూపాయల కొద్దీ వ్యాపారం జరుగుతుంది.ఒకప్పుడు జోరుగా సాగే రికార్డింగ్ డాన్సులు శ్రీ ఈదర గోపీచంద్ నేతృత్వంలో అశ్లీలతా ప్రతిఘటన వేదిక జరిపిన పోరాటం వల్ల వెనుక బడ్డాయి. వాటిని పూర్తిగా నిషేధించినా, రాత్రి పొద్దు పోయాక తిరణాల లోని కొని చోట్ల ప్రభల మీద జరుగుతూనే ఉన్నాయని ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి.

తిరణాల ముగిసిన రెండు మూడు రోజులకు కొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద పెట్టున వర్షం కురిసి, రద్దీ వల్ల పేరుకున్న చెత్త, అశుభ్రం అంతా కొట్టుకుపోయి కొండ శుభ్ర పడటం ప్రతి యేటా జరిగే ఒక విచిత్రం!

అత్యంత ప్రజాదరణ పొందిన మా కోటప్ప తిరణాలకు రాష్ట్ర పండుగ హోదా లభించింది ఈ ఏడాది. దీనివల్ల మరిన్ని నిధులు సమకూరి మరింత శోభాయమానంగా కోలాహలంగా తిరణాల జరుగుతుందన్నమాట
.

ఈ ఏడాది తిరణాల విశేషాలు:
జనం పోటెత్తి పోవడంతోను, VIP లు పని పాటా లేకుండా పదుల కొద్ది చుట్టాల్ని వేసుకుని దర్సనానికి రావడంతోను పాపం మన లాంటి మామూలు జనం చాలా ఇబ్బందులు పడ్డారట.  సాక్షాతూ మంత్రి కాసు కృష్ణా రెడ్డి గారే వెనుదిరిగి పోయి మళ్ళీ వచ్చారని వార్తలు. ఇదెలా ఉన్నా, మూడు రోజుల క్రితం జరిగన తిరణాల ఫోటోలు పేట్రియాట్స్ బ్లాగుకు ప్రత్యేకం!


మహా శివుడి దర్శనం ఫోటోతో మంగళం!

ఎలా ఉంది మా కోటప్ప తిరణాల? మీరే వెళ్లి వచ్చినట్టు లేదూ!!

--

Thursday, February 9, 2012

రచ్చ గెలిచి ....ఇంట తెలియని మా వూరి వేణువు



 ఇంతకు ముందు వ్యాసంలో ఏల్చూరి విజయ రాఘవరావు గారి గురించి కొంత సమాచారాన్నిసేకరించి పొందు పరచగలిగాను. ఆ వ్యాసం చూశాక, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి కుమారుడు శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు మరిన్ని విశేషాలను, అరుదైన ఫొటోలను (వారి ఫామిలీ ఆల్బం లోంచి) ప్రచురణార్థం అందజేశారు. అవి చేరిస్తే ఆ వ్యాసం మరింత విస్తరించే అవకాశం ఉన్నందుకు మరో బ్లాగ్ పోస్టులో వాటిని పొందుపరుస్తున్నాను.

ఆయన కూడా నరసరావుపేట ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థి. అక్కడ మహాకవి శ్రీనాయని సుబ్బారావు గారి శిష్యులు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలిగా పనిచేసినప్రఖ్యాత విద్వత్కవయిత్రి డా. నాయని కృష్ణకుమారి గారు వీరికి సహాధ్యాయిని.

 
వీరు 1942లో నరసరావుపేటలో తమ అన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారిఅధ్యక్షతను వెలసిన “నవ్యకళాపరిషత్తు”లో తొలితరం సభ్యులు. అన్నగారి ప్రాణమిత్రులైన రెంటాలగోపాలకృష్ణ గారు, అనిసెట్టిసుబ్బారావు గారు, మాదల వీరభద్రరావు గారు, శ్రీ మునిపల్లెరాజు గారు, చలనచిత్ర దర్శకులు గిడుతూరిసూర్యం గారు వీరికీ చిన్నప్పటి నుంచి కూర్మినెచ్చెలులు. సంగీత సాధనకు సమస్కంధంగాకవితారచనతోపాటు కథలు కూడా వ్రాశారు.

ఒకనాటి అరసం నడిపిన “అభ్యుదయ”; కొల్లా వెంకయ్య గారి “పొగాకులోకం”;
సూర్యదేవరరాజ్యలక్ష్మి గారి “తెలుగుదేశం”;
సెట్టి ఈశ్వరరావు గారుప్రారంభించి, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చివేసినమునుపటి “విశాలాంధ్ర”
మొదలైన పత్త్రికలలో వీరి రచనలనేకం కనబడతాయి.

పెద్దయాక “అంతర్వాణి”,  “అభ్యుత్థానం”,విజయాంజలి” మొదలైన కవితా సంపుటాలను, మూడు కథాసంపుటాలను, “స్వప్నజనితరాగాలు” అనే గేయ, కథారచనల సంకలనాన్ని, సుందరకాండ గేయ అనువాదాన్ని ప్రచురించారు.




ఇంగ్లీషులో వీరి “నిర్వాణ అండ్అదర్ పోయమ్స్” అనే సంపుటానికి అమెరికాలో ఉత్తమ కవిగా దేశీయ పురస్కారం వచ్చింది.  తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ భాషలలోపాండిత్యాన్ని సంపాదించటమే గాక ఆ భాషలలో పెక్కు రచనలు చేశారు. ఆ అన్ని భాషల రచనా సమాహారంగాఒక అద్భుతమైన సంగీత వాద్యబృంద కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచమంతటా ప్రదర్శించారు.

    
శ్రీయుత  విజయరాఘవరావు గారి సంగీతవిజయాలు అసంఖ్యేయాలు. రిచర్డ్ ఆటెన్ బరో గారి "గాంధీ" ఆంగ్లచిత్రానికిఆయన సంగీతం సమకూర్చిన సంగతి, అందులోని మనసులకు హత్తుకొనిపోయే ఫ్లూట్ బిట్ విషయం చాలామందికి తెలియదు. ఆ చిత్రనిర్మాణంతర్వాత శ్రీ ఆటెన్ బరో గారు వీరి ప్రతిభను మెచ్చుకొంటూ వ్రాసిన లేఖ ఒక జాతీయ పురస్కారానికన్నాఎంతో విలువైన దనిపిస్తుంది.

మృణాళ్ సేన్ గారి "భువన్ షోమ్" చిత్రానికిజాతీయ సంగీత దర్శకునిగా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకోవటం; ఎం.ఎఫ్. హుసేన్ గారు నిర్మించిన అజరామరమైన దృశ్యకావ్యం  "Through the eyes of a painter "చిత్రానికి ఆయన అంతర్జాతీయ గోల్డెన్ బేర్ సంగీత దర్శక పురస్కారాన్నిగెలుపొందటం; రుడ్యార్డ్కిప్లింగ్ "జంగిల్బుక్" చిత్రానికి సంగీత రచన; తెలుగులో మృణాళ్ సేన్ గారి "ఒక వూరి కథ"కుఇచ్చిన అద్భుతమైన సంగీతం;"రెయిన్ బో" సంగీత ప్రయోగం; జెకోస్లావియన్ భారతీయ-పాశ్చాత్య సంహితాత్మక సంగీత సమ్మేళనాలు; ఆయన కనిపెట్టినహిందూస్తానీ కొత్త రాగాలు వంటివి ఇంటర్నెట్ లో లేకపోవటం వల్ల చాలా విశేషాలు ఈనాటి యువతీ యౌవనులకు తెలియకపోవటంలో ఆశ్చర్యంలేదు.


పండిట్ రవిశంకర్ గారు కోరికపై ఆయన స్థాపించినదే ఢిల్లీలో మండీ హౌస్ వద్ద వెలసిన త్రివేణీ కళా సంగమ్ భవనం. కవిగా ఆయన సాహిత్య విజయాలు, అమెరికాలో ఉత్తమఆంగ్లకవిగా పొందిన పురస్కారాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు "గానకళాప్రపూర్ణ' పురస్కారాన్ని అందుకోవటం; ఆయనఅభిమానులైన దేశ విదేశాలలోని రసజ్ఞులు కురిపించిన ప్రశంసా వర్షా వాక్యావళిని ఉదాహరిస్తేఅదొక విజ్ఞాన సర్వస్వం అవుతుంది. పాల్ మెకార్త్నీ, యెహూదీ మెనూహిన్, పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అల్లా రఖా, వారి తనయులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శ్రీ ఉదయ్ శంకర్, సత్యజిత్ రే, మృణాళ్ సేన్ వంటి మహామహు లందఱూ వీరికిఆత్మీయులు.

గొప్ప వక్త; సరస సల్లాపకోవిదాగ్రణి. ప్రపంచమంతటా పర్యటించి భారతీయ సంగీతాన్ని, తెలుగు భాషను దిగంతాలలో పరిమళింపజేశారు.


వీరి అన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు 1944 ఆగస్టులో కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసులతో కలిసి తెలుగులో అచ్చైనతొలి వచన కవితా సంకలనం “నయాగరా”ను వెలువరించారు. వీరి సహధర్మచారిణి లక్ష్మి గారు కూడాకర్ణాటక-హిందూస్తానీ వేణువాదన నిపుణురాలు.  వీరి బావగారు కీ.శే. దుగ్గిరాల రామారావు గారు ఏలూరులోఉండేవారు. ఆకాశవాణిలో “ఎ” గ్రేడు ఆర్టిస్టుగా గుర్తింపును పొందిన ప్రముఖ వేణువాదన విద్వాంసులు. బావమఱది శ్రీ దుగ్గిరాల సుబ్బారావు గారు డి.ఎస్.రావుగా విఖ్యాతులు. కేంద్ర సాహిత్య అకాడెమీ సెక్రెటరీగా పదవీ విరమణ చేసి, విద్యారంగం లోనికి ప్రవేశించి, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనేఅత్యుత్తమ ఆంగ్లోపాధ్యాయునిగా మన్నన గడించారు. వారు కూడా ప్రఖ్యాత ఆంగ్ల భాషా రచయిత, గ్రంథకర్త; త్రిపురనేని గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర”ను, ఇంకా అనేక ఇతర విదిత నవలలను తెలుగు నుంచి ఆంగ్లానువాదాలు చేసిన కోవిదులు.అమెరికాలో ఉన్నారు.


శ్రీ విజయరాఘవరావు గారి జ్యేష్ఠ తనయుడు విజయవర్ధన్ విజ్ఞాన శాస్త్రవేత్త అయినప్పటికీతండ్రి వద్దనే వేణుగానం అభ్యసించారు. కచేరీలు చేశారు. చిన్న కొడుకు సంజయ్ కె. రావుకూడా అమెరికాలో పారిశ్రామికవేత్తగా గుర్తింపును పొందినా తండ్రి వద్దనే తబలా అభ్యసించినసంగీతకోవిదుడు. పెక్కు అంతర్జాతీయ వాద్యబృంద కార్యక్రమాలను నిర్వహించారు. డాక్యుమెంటరీచిత్రనిర్మాత.


ప్రఖ్యాత కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు “తిరణాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా”అని వ్రాసిన అందమైన గీతానికి శ్రీ విజయరాఘవరావు గారు ముగ్ధులై, ఆశువుగా రాగాన్ని కట్టి విజయవాడ ఆలిండియా రేడియోలోరికార్డింగు చేస్తుంటే ఆ చిరస్మరణీయమైన దృశ్యాన్ని “రామం” గా వివిధభారతి రేడియో అభిమానులగుండెలలో గుడికట్టుకొన్న శ్రీ ఎస్.బి. శ్రీరామమూర్తి గారు “ఒక పాట పుట్టింది” అన్నరమణీయమైన శబ్దచిత్రకావ్యంగా మలిచారు. విఖ్యాత చాయాచిత్రగ్రాహకులు శ్రీ జితేంద్ర ఆర్యగారువీరి చిత్రాలను తీసి తమ సంకలనంలో చేర్చుకొన్నారు.  



విజయరాఘవరావు గారు తమ గురువులైన పండిత రవిశంకర్ గారితో ఢిల్లీ ఆకాశవాణిలో చేరి, వేణువాద్యనిపుణునిగా ప్రతిష్ఠాత్మకములైన పెక్కు జాతీయ కార్యక్రమాలలో పాలుపంచుకొన్నారు. ఆకాశవాణి పురస్కారాలను పొందారు. ఈమని శంకరశాస్త్రి గారు, కామశాస్త్రి గారు, నల్లాన్ చక్రవర్తుల జగన్నాథాచార్యులు గారు మొదలైన పెద్దలతో వాద్యబృంద సమ్మేళనాలను నిర్వహించారు.

ఆ తర్వాత బొంబాయి వెళ్ళి ఫిలిమ్స్ డివిజన్ లో దర్శకత్వ బాధ్యతను స్వీకరించి మూడు దశాబ్దుల కాలంలో వందలాది డాక్యుమెంటరీలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరి శిష్యులు హిందీ చలనచిత్రాలలో చేరినా, పెక్కుమార్లు ఆహ్వానాలు, ఒత్తిడులు వచ్చినా, ఎట్టి ప్రలోభాలకూ లొంగక శాస్త్రీయ సంగీతానికి పరిమితమై వాణిజ్య కళకు దూరంగా ఉండిపోయారు.

"జనగణమన" జాతీయగీతానికి వీరూ ఒక రాగనిర్దేశం చేశారని చాలామందికి తెలియదు. ఆ గీతానికి వివిధ రాగాల సముచ్చయాన్ని చారిత్రకంగా విశ్లేషించిన ఒక డాక్యుమెంటరీకి వీరు దర్శకత్వం కూడా వహించారు. "ఏషియాడ్" క్రీడోత్సవాలు తొలిసారి ఢిల్లీలో జరిగినప్పుడు పండిత నరేంద్రశర్మ గారి "స్వాగతం, శుభస్వాగతం" అన్న గీతికకు వీరి
సంగీతం చాలా ప్రాచుర్యాన్ని పొందింది. 
మంచి రూపసి కావడం వల్ల ఒకటి రెండు పర్యాయాలు సంగీత ప్రధానములైన తెలుగు చిత్రాలలో ప్రధాన భూమికకు వీరిని ఆయా చిత్రనిర్మాతలు   కోరినా, ఆ విధమైన ఆసక్తి లేక వీరు అంగీకరింపలేదు.  

Friday, January 27, 2012

మూగవోయిన మా వూరి వేణువు ...ఏల్చూరి విజయరాఘవ రావు...!




 కళాకారులు మనల్ని దాటిపోయేదాకా నిరామయంగా ఊరుకుని.వారు గతించగానే వారి గొప్పను తల్చుకుని కన్నీళ్ళెట్టుకోడంలో నాక్కూడా మినహాయింపు లేదు. వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కవి,నాట్యకారుడు స్వర్గీయ శ్రీ ఏల్చూరి విజయ రాఘవ రావు గారి గురించి....మా వూరి మనిషి గురించి ఆయన మరణించాక ఈ బ్లాగులో రాద్దామని నేను అనుకోలేదు. కానీ .......మరణించాకే రాస్తున్నా!
                                                                 శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం దంపతులతో 
ఆయన మరణించిన సంగతి కూడా వెంటనే పత్రికల్లో రాకపోవడం వల్ల ఆ వార్త కూడా అందర్లాగే నాకూ ఆలస్యంగానే తెలిసింది. చాలామందికి ఆయన గుర్తే లేరు. ఆయన దశాబ్దాలుగా విదేశాల్లో స్థిరపడి పోవడమూ,కళ్ళ ముందు రోజూ హడావుడి చేస్తుండేవాళ్లను తప్ప మీడియా పట్టించుకోకపోవడమూ,ముఖ్యంగా ఆయన తనదైన అలౌకిక ప్రపంచంలో కీర్తి కిరీటాలకు దూరంగా ఉండటమూ ఇవన్నీ ఆయన మనకు దూరంగా జరిగిపోడానికి కారణాలు కావొచ్చు!

ఇతర పనుల్లో బిజీగా ఉండి ఈ బ్లాగుని రాతల్ని కొద్ది నెలలుగా వాయిదా వేస్తూ ఉండటం వల్ల నేనూ ఇప్పుడు రాయవలసి వచ్చింది.

"సూర్య" దినపత్రికలో అక్కిరాజు రమాపతి రావు గారు రాసిన వ్యాసం చదివే వరకూ, నాకు విజయరాఘవ రావు గారి గురించి చాలా విషయాలు తెలీవు. మా తరానికి కాస్త ఊహ తెలిసే సమయానికి ఆయన దేశమే విడిచి పెట్టారాయె!

గాంధీ అన్న పేరు వినగానే స్ఫురించే "రఘుపతి రాఘవ రాజారాం" ని ఆయనే స్వర పరిచారని, సర్దార్ పటేల్ అనారోగ్యంతో ఉన్నపుడు విజయ రాఘవ రావు గారు తన సంగీతంతో ఆయనకు సాంత్వన చేకూర్చారని,విజయరాఘవ రావు గారు అంగీకరిస్తే కోట్ల రూపాయల ఖర్చుతో ఒక సంగీత కళా నిలయాన్ని పండిట్ రవి శంకర్ ఢిల్లీలో స్థాపిస్తానని అన్నారని.........ఏమీ తెలీవు! 




శ్రీ విజయరాఘవ రావు గారు శ్రీ ఏల్చూరి రామయ్య,సుబ్బాయమ్మ దంపతుల ద్వితీయ సంతానం.1925, నవంబర్ 3 న జన్మించారు.   ఆయన పసి బిడ్డగా ఉండగానె తండ్రి కాలం చేశారు.  వీరి అన్నగారు నయాగరా  కవుల్లో ఒకరైన శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు.  తండ్రి గారి నుంచి ఆయనకు సంగీతాభిమానం సంక్రమించింది.

 ఆ రోజుల్లో నరసరావుపేటలో ఎకరాల కొద్దీ విస్తరించిన పెద్ద చెరువు నిండుగా నీళ్లతో తొణికిసలాడుతూ పలనాడు రోడ్డు వెంబడే ఉండేది. (అయితే నాలుగు దశాబ్దాల క్రితమే దానిలోకి నీరు చేరే అన్ని మార్గాలను మూసి వేసి పూర్తిగా ఎండగట్టి దాన్ని నివాస ప్రదేశంగా మార్చారు). చెరువు కట్ట దగ్గర్లోనే ఏల్చూరి రామయ్య గారి ఇల్లు రాళ్ళబండి వారి వీధిలో ఉండేది. కొణిదెన వారి ఇంటి పక్కగా! ఇప్పుడు రాళ్లబండి వారి వీధి వీధంతా ఆసుపత్రులే! ఏల్చూరి వారి ఇల్లు డాక్టర్ గడ్డం హరిబాబు, డాక్టర్ సునీత ల ఆసుపత్రిలో భాగంగా మారిపోయింది.

ఆ వీధికి పక్కగానే యాదవుల వీధి(పాతూరు శివాలయానికి వెళ్ళే రోడ్డు) ఉంది. చెరువు కట్ట మీద యాదవుల పిల్లలతో కూడి వారి వద్దనే వేణువు వాయించడం నేర్చుకున్న విజయరాఘవరావు గారికి  ప్రాథమికంగా   గురువు ఎవరూ లేరంటే ఆశ్చర్యమే!అయితే గొల్ల పిల్లలతో చేరి కూడా అల్లరి చేయకుండా విద్యను మాత్రమే గ్రహించే వారు. తర్వాతి రోజుల్లో శాస్త్రీయ సంగీత కచేరిలు చూసి, ఇంటికి వచ్చి సాధన చేసేవారట. 

అలా చెరువు కట్ట మీద రావి చెట్టు కింది అరుగు వారి సంగీత సాధనకు వేదికైందన్నమాట. ఆ సంగీతానికి శ్రోతలుగా అనిసెట్టి కృష్ణ, నరసరావు పేటలోని కన్యకా పరమేశ్వరీ గ్రంథాలయాన్ని జాతీయ గ్రంథాలయాలతో సమానంగా తీర్చి దిద్దిన విద్యావేత్త మస్తాన్ గార్లు ఉండేవారు.  అనిసెట్టి కృష్ణ గారి ప్రేరణతో ఆ తర్వాత ఆయన మద్రాసు వెళ్ళి కళా క్షేత్రంలో సంగీతం, రుక్మిణీ అరండేల్ గారి వద్ద భరత నాట్యం అభ్యసించారు.అక్కడికి వచ్చిన ప్రఖ్యాత నర్తకులు ఉదయ శంకర్ గారి దృష్టిని ఆకర్షించి వారి నృత్య బృందం లో  నర్తకుడిగా దేశ విదేశాలూ తిరిగారు.  ఆ ప్రదర్శనలు ఇస్తున్నపుడే ఒకసారి రష్యాలో  నాట్య ప్రదర్శన అనంతరం వేణు గానంతో అక్కడి శ్రోతల్ని అబ్బుర పరిచారు.  ఆ సందర్భంలోనే ఉదయ శంకర్ గారి సోదరుడు పండిట్ రవి శంకర్ తన శిష్యుడిగా స్వీకరించి హిందూస్తానీ సంగీత ప్రపంచంలోకి ఆయన్ని ఆహ్వానించారు. అక్కడితో ఆయన ప్రతిభ మరింతగా విస్తరించింది.

తర్వాత వారు నరసరావు పేట బిడ్డ అయినా కళామతల్లి ముద్దుబిడ్డగానే పెరిగారు. ఎన్నెన్నో కీర్తి ప్రతిష్టలారించారు. ఎన్నో శిఖరాలెక్కారు. 

అయినా మా నరసరావు పేట పట్టణం పధ్నాలుగేళ్ళ క్రితం రెండు వందలేళ్ళ పండగ చేసుకున్నపుడు ఆయన మా వూరి బిడ్డ గా తల్లి ఒడికి చేరాలన్న తపనతో మా వూరికి వచ్చారు. 

ఆ సందర్భంలో వారికి సన్మానం చేసి, వూరు వూరంతా గర్వపడి,పరవశించింది. ఆయన మాత్రం? ఎన్నో ఏళ్ళకు తల్లిని చూసిన బిడ్డలాపరవశించి, ఈ వూరితో తన అనుబంధాన్ని పంచుకుని ప్రసంగించారు  . ఆ రోజు వారి గురించిన ఒక ప్రత్యేక వ్యాసం కూడా ఈనాడు దినపత్రికలో ప్రచురితమైంది. అలాగే ఆనాటి సన్మాన సభ వివరాలున్న వార్త క్లిప్పింగ్ కూడా ఇక్కడ పంచుకుంటున్నాను!
ఈ మాట పత్రికలో కొడవటి గంటి రోహిణి ప్రసాద్ గారు రాసిన వ్యాసం  ఇక్కడ.

విజయరాఘవ రావు గారి స్మృతికి మా వూరి ప్రజలందరి తరఫునా శ్రద్ధాంజలి!