Pages

Tuesday, February 9, 2010

మెట్లదారిలో కోటప్ప కొండెక్కి...!



ఈ రోజు ఏకాదశి. మా కోటప్ప కొండ దగ్గరి దృశ్యాన్ని ఊహించుకుంటే రెక్కలుంటే బావుండు, ఎగిరెళ్ళి అక్కడ వాలిపోదామనిపించేంత తిక్కగా ఉంది! అక్కడ , త్రికోటేశ్వరుడిని దర్శించుకోడానికొచ్చిన వేలాది, లక్షలాది మనుషుల మనసుల నిండా ఆ మహాదేవుడే నిండిపోయి ఉంటాడు. తిరణాల తిరణాలే...భక్తి భక్తే! అంతా కోలా హలం! అంతా సందడి, అంతా సరదా!(తిరునాళ్ళు సరైన పదమనుకుంటా గానే మేము తిరణాల అనే అంటాం మరి)




ఊళ్ళోనే ఉన్నా ఏడాదికొక్కసారైనా కనపడని బంధువులూ, స్నేహితులూ పరిచయస్తులూ అంతా కోటప్ప కొండ తిరణాల్లో కలుస్తారని మా వూర్లో జోకుంది.






మహాశివరాత్రి పండగరోజైతే చుట్టు పక్క పల్లె జనాలంతా ట్రాక్టర్లూ, ఎడ్లబండ్లూ, ప్రభల్తో వస్తారు కాబట్టి మరీ రద్దీగా గా ఉంటుందని సాధారణంగా మా టౌను వరకూ ఏకాదశి రోజే కొండ మీద ప్రత్యక్షం అవుతుంది.పల్లెటూరి జనాల రద్దీని తట్టుకోలేం అనేది మరో భావన! అక్కడికి మేమేదో క్లాసూ,పల్లెటూరి జనాలంతా మాసూ అని మాకో పెద్ద భ్రమ!



దాదాపు తొమ్మిదివందల మెట్లు! స్నేహితులు, బంధువులు,ఇరుగు పొరుగులు అందర్తో కలిసి మెట్లదారిలో కొండెక్కడం అప్పట్లో ఒక పెద్ద గొప్ప! ఫాషన్, సరదా, సంప్రదాయం, ఇంకా చాలా!




తిరణాలంటే చెప్పేదేముంది! వందల సంఖ్యలో రాత్రికి రాత్రే వెలసే దుకాణాలు,లారీల్తో వచ్చి వాలే చెరుకుగడలూ,రంగుల రాట్నాలు, అంతా సంతోషమే, అంతా ఉల్లాసమే!



కొండమీదేమో ఇవేవీ పట్టని ఆదిభిక్షువు!



* * *



అసలు మా వూరికీ, మహాశివుడికీ గొప్ప అనుబంధం ఉంది. ఊరిమధ్యలో భిక్షా పాత్రతో గంభీరంగా రోడ్డు మధ్యలో బైఠాయించిన శివుడి విగ్రహాన్ని మీరు ఇంకెక్కడైనా చూశారా? చూడకపోతే కొంచెం పక్కకిచూడండి...కనపడతాడు..మా వూర్లోని మహాశివుడు. మూడోకన్ను జనం మీద పడకుండా భిక్షాపాత్రతో నీరు తాగుతున్నట్లు అది కొంచెం ముఖానికి అడ్డంగా వచ్చేట్లు చెక్కాడు శిల్పి సూరిగారు.



మా వూరి చరిత్రే పాతూరు శివాలయం వీధి నుంచి మొదలైంది ! ఆ భీమలింగేశ్వరాలయానికి 1100 యేళ్ళ చరిత్ర ఉంది. ఊరికి కాస్తంత చివరగా త్రికూట పర్వతం మీద కొలువైన కోటయ్య స్వామి కూడా యేటా లక్షలకొద్దీ భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. ఊరు చుట్టుపక్కల పల్లెల్లో ప్రతి నాలుగైదు ఇళ్ళకో ఒక కోటేశ్వర్రావో, కోటయ్యో, ఉండటం,వాడిని "కొండ"అని పిలవడం మామూలే!





శివరాత్రికి కొండకెళ్ళాలని శివరాత్రి ముగిసిన మర్నాటినుంచే ఎదురు చూసేవాళ్ళే ఊర్నిండా! చిన్నప్పుడు తప్పిపోతామని మమ్మల్ని ఇంట్లో పడేసి, పెద్దవాళ్లంతా కొండకెళ్ళిపోయేవాళ్ళు గానీ కాలేజీ కొచ్చాక పోన్లే పాపమని మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. మావయ్యలు,పిన్నులు,అత్తలూ వీళ్ళంతా తయారు.

ఆడపిల్లలంతా పట్టు పరికిణీల్లో , చిలకల్లా వాళ్ల వెంటే! చిలకాకు పచ్చ పట్టు లంగా మీదికి పింక్ రంగు వోణీ(లంగా అంచు రంగన్నమాట),రాణీ పింక్ రంగు పట్టులంగా మీదికి నేవీ బ్లూ వోణీ(ఏంటలా నవ్వుతారు,... ఇవి అప్పట్లో భలే హాట్ కలర్ కాంబినేషన్లు తెల్సా) పసుపు పచ్చ పట్టులంగా మీద......తెలుసుగా మెరూన్ కలర్ వోణీ! ఈ రంగుల్లో బోల్డన్ని సీతాకోకచిలకలు!



అన్నయ్యలు,మావయ్య కొడుకులూ మిగతావాళ్ళంతా పోజు కొడుతూ "వీళ్ళు చూడండ్రా,ఎలా గంగిరెద్దుల్లా తయారయ్యారో!.వీళ్ల పక్కన కూడా నడవొద్దురరేయ్"అనేసి కట్ట కట్టుకుని మాకంటే ముందే కొండెక్కేసేవాళ్ళు.



క్రిక్కిరిసిన కొండ మెట్లదారిమీద ఇరవై మెట్లెక్కేసరికి "ఇక నావల్ల కాదు"అనిపించేది.ఐదునిమిషాలాగి మళ్ళీ ఎక్కడం! పచ్చటి ప్రకృతి పరుచుకున్న కొండమీద మెలికలు తిరిగే మెట్లూ, మధ్య మధ్యలో ఆకు దొనెల్లో కుంచెమంటే కుంచెమే పులిహోర,మంచినీళ్ళు అందించే సత్యసాయిసేవా సమితివాళ్ళూ(వాళ్ళలో మాకు తెలిసినవాళ్ళుండి,మాక్కొంచెం ఎక్కువ పులిహోర పెట్టేవాళ్ళు) పసి పిల్లల్ని భుజాలమీద కూచోబెట్టుకుని కొండెక్కే నాన్నలూ, కొంచెం ఆదమరుపుగా ఉంటే చేతిలో పొట్లాలో,అరటిపళ్ళో లాక్కెళ్ళిపోయే కోతులూ,నీళ్ళు కలిపిన పసుపు కుంకుమల బకెట్లతో మెట్ల పూజ చేస్తూ ఎక్కే వాళ్ళు, ఉన్నట్టుండి "చేదుకో కోటయ్యా చేదుకో"అని వినపడే భక్తుల కేకలు!





చిన్నప్పుడు మాకు అది "చేరుకో కోటయ్యా"అని వినపడి ఉషశ్రీని అడిగితే బాగోదని ధర్మ సందేహం అమ్మనడిగాం "మనం కదా కొండెక్కేది? ఆయన్ని 'చేరుకో" అనడమేమిటి?"అని!



అమ్మ ఆశ్చర్యంగా నవ్వేసి "అది చేరుకో..కాదు! చేదుకో! నూతిలో వేసిన చేద బకెట్ ని పైకి ఎలా సులభంగా లాగుతామో,అలా కొండెక్కే శ్రమ తెలీకుండా పైకి చేదుకోమని అడగడం అన్నమాట"అని చెప్పింది.


కొండమీద కనపడితే చాలు చేతిలో తినుబండారాలూ, జళ్ళో పూలూ లాక్కెళ్ళి పోయే కోతులు =తయారు. చేత్లో కొబ్బరిచిప్పలు చూశాయా...వెంటే వస్తాయి. రమ్మంటే దగ్గరికి వచ్చి చాలా స్నేహంగా తీసుకుంటాయి చేతిలో అరటి పళ్ళూ, కొబ్బరి చిప్పలూ! 



పండగ రోజు చుట్టుపక్కల పల్లెటూళ్ళనుంచి సింగారించుకుని వచ్చే ప్రభలు! గణపవరం,దేచవరం,రూపెనగుంట్ల,రావిపాడు,చల్లగుండ్ల,గామాలపాడు,నకరికల్లు,కళ్ళగుంట,ఒప్పిచర్ల,లింగంగుంట్ల,కేసనపల్లి, ఈ వూళ్ళన్నిటినుంచీ మైకు సెట్టింగుల్తో,ఎలక్ట్రిక్ దీపాలతో ట్రాక్టర్ల మీద వస్తాయి.((పండగ రోజు ఉదయం నుంచీ మర్నాడువరకూ మాకు కరెంట్ ఉండేది కాదు.మా ఇంటికి దగ్గర్లోని రోడ్డుమీదినుంచీ ఈ ఎలక్ట్రిక్ ప్రభలన్నీ వెళ్ళేవి)ఇదివరలో ఎడ్లబండ్లమీద వచ్చేవట)



ఆ ప్రభలు ఒక పెద్ద సందడి. పందాలు పడి ఒకరి కంటే ఒకరు ఎత్తుగా కడతారు కాబట్టి అవి పడిపోకుండా, వాలిపోకుండా ఉండటానికి బలమైన మోకులు(తాళ్ళు) ముందు, వెనకా కట్టి కొందరు అవి పట్టుకుని కొండదాకా నడిచి వస్తారు. ఎన్ని మైళ్ళయినా సరే! సంప్రదాయం ప్రకారం ఎద్దులతో కాసేపు ప్రభను లాగించి ఆ తర్వాత ట్రాక్టర్ కి కట్టేవాళ్ళు. ఆ ప్రభను ఏదైనా వూళ్ళో లంచ్ బ్రేక్ కోసం ఆపినపుడు అక్కడి ఆడవాళ్లంతా పెద్ద పెద్ద బిందెల్తో నీళ్ళు తెచ్చి ప్రభ ముందు "వారు" పోయడం చిన్నపుడు చూస్తుండేవాళ్ళం.



ఇదంతా ఎప్పటిదో పాత కథ!




ఆ తర్వాత మా వూరి మాజీ ఎమ్మెల్యే మంత్రిగారిగా కూడా ఉన్నపుడనుకుంటా కొండమీదికి ఫటా ఫట్ రాజమార్గం లాటి ఘాట్ రోడ్డు వేయించేశారు.(రాజు తల్చుకుంటే అని ఊరికే అన్నారా)ఇప్పుడు కింద నుంచి కొండమీదికి ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయల షాపులనుంచీ,చెప్పుల స్టాండ్ ల దాకా అన్నీ పక్కా దర్శనీయ స్థలాల్లో లాగానే కొండమీదే తయారయ్యాయి.నరసరావుపేట నుంచి కొండకెళ్ళేదారి NH5 కంటే నున్నగా అందంగా ఉంటుందిప్పుడు.  దారి పొడుగునా బోలెడన్ని ఇంజనీరింగ్ కాలేజీలు!  కొండపాదాల వద్దే టూరిజం డిపార్ట్ మెంట్ వారి కాటేజీలు..కళ్ళు చెదిరే అందంతో,ఏసీ సహా సకల సౌకర్యాలతో! అసలు ఇదొక రిసార్ట్ లా ఉందిప్పుడు.




ఘాట్ రోడ్డు ప్రతి మలుపులో కనువిందు చేసే పార్కులు,విగ్రహాలు!అంతా మారిపోయింది.అసలు కొండమీద గుడి కూడా మారిపోయింది. మూలవిరాట్ ని నేను గుర్తేపట్టలేదు. "ఇదేనా గర్భగుడి"అని ఆశ్చర్యపోయాను. కోటప్ప
మాత్రం నన్ను గుర్తుపట్టి "ఏందమ్మాయ్,ఎప్పుడొచ్చా? ఏందిట్ట మారిపొయ్యావు? ఈ మజ్జెన అవుపడట్లేదేంది?"అని మా వూరి యాసతో పలకరించాడనుకోండి!




సౌకర్యాల పరంగా కొండ ఇప్పుడెంతో మెరుగ్గా హాయిగా ఉంది కానీ ఘాట్ రోడ్డుపడటంతో మెట్లదారిని వాడేవారే కరువయ్యారు. పండగ సమయాల్లో మెట్లదారిన వస్తామనో,మెట్లపూజ చేస్తామనో ఎవరైనా మొక్కుకుంటే తప్ప!



ఏది ఎంతగా మారినా,ఎంత ఘనంగా రోడ్లూ గోపురాలూ కట్టినా మా కోటయ్య మాత్రం మారడు.





తీపిరాగాల కోకిలమ్మకు నల్లరంగులలుముతూనో,కరకు గర్జనల మేఘ మాలలకు మెరుపు హంగులద్దుతూనో, ఆ ఆది భిక్షువు చిద్విలాసంగా కొండకొచ్చేవారిని చిరునవ్వుతో పరికిస్తుంటాడు.



" కోటయ్య సావి మీద ఆన బెట్టి చెప్తున్నా"అని అలవోగ్గా అబద్ధాలాడేసే రాజకీయనాయకుల్ని సైతం అదే చిరునవ్వుతో చూస్తూ "నీ లెక్క తర్వాత చూస్తాన్లే"అంటాడు.



ఊరు ఊరంతా సంతోష సాగరమై కొండకు పరుగులు తీసే వేళ ఊరికి దూరంగా ,ఇక్కడ....ఆ మహాదేవుడి సన్నిధికి ఊహల్లోనే మెట్లదారిన కొండకు ప్రయాణమవుతున్నా!


అన్నట్టు, అద్దిరిపోయే ఫొటోలు తీసిందెవరో కాదు, నేనే!

ఎలక్ట్రిక్ ప్రభ ఫొటో ఇచ్చినందుకు గోగినేని వినయ్ చక్రవర్తి గారికి కృతజ్ఞతలు