Pages

Wednesday, November 11, 2009

మా వూరి గ్రంథాలయం కబుర్లు!

కళా సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసే మా వూర్లో లైబ్రరీ గురించి చెప్పకపోతే మాకు పాపం చుట్టుకుంటుంది. అందుకే మొన్నీమధ్య సెలవులకు వెళ్ళినపుడు కాస్తంత భోగట్టా చేద్దామని వెళితే అక్కడ లైబ్రరీ లేదు. నా గుండె ఆగిపోయింది.

అప్పుడెప్పుడో చాన్నాళ్ల క్రితం ప్రభుత్వం ఈ శాఖా గ్రంథాలయాలని ఎత్తేయాలని అనుకుందట. నేను లేకుండా చూసి అలాంటి కుట్రేమన్నా చేశారా అనుకున్నా!అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది.వాళ్లనడిగితే లైబ్రరీ ఏమిటన్నారు. వాళ్ళు హోటల్ పెట్టేనాటికి అది లేదన్నారు(ఏడిసినట్టుంది. అదుంటే వీళ్ళు హోటలెలా పెడతారు?)

ఇంట్లో అడక్కుండా వచ్చినందుకు చింతిస్తూ అన్నయ్యకు ఫోన్ చేసి "శాఖా గ్రంథాలయం ఇక్కడ లేదేంట్రా" అంటే వాడు "తీసేశారు" అన్నాడు క్లుప్తంగా!  

"తీసేశారా, మరి ఆ పుస్తకాలన్నీ ఏం చేశారు? "నిర్ఘాంతపోయాను మరో పక్క మనసులో అత్యాశపడుతూ!(ఆ పుస్తకాలన్నీ ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయనే నమ్ముతూ)

" తొందర పడొద్దు!  ఎత్తేశారన్లేదు నేను. అక్కడినుంచి తీసేశారు.  మన సత్యనారాయణ టాకీసు పక్కనే కట్టారిప్పుడు కొత్త బిల్డింగ్"  వాడు.

అక్కడికెళ్ళి చూద్దును కదా, ఇదిగో ఇదే లైబ్రరీ!



ఇంత పెద్ద బిల్డింగ్ ని లైబ్రరీగా చూస్తామని ఎప్పుడూ కల కూడా కనలేదు. ఎప్పుడూ అరండల్ పేటలోనే ఏదో ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని నడిపిస్తుండేవాళ్ళు. కాకపోతే కండిషన్ ఏమిటంటే వాళ్ళు అద్దెకు తీసుకునే ఇంటికి పొడుగాటి వరండా ఉండాలి. పేపర్లు చదువుకునే వాళ్ళకోసం!


మా నరసరావుపేట శాఖాగ్రంథాలయం 1956 లో స్వల్ప సంఖ్యలో పుస్తకాలతో ప్రారంభమైంది. ఇప్పుడున్న పుస్తకాల సంఖ్య దాదాపు యాభై వేలు.  దీనితో  దాదాపు మా వూర్లోని విద్యార్థులందరికీ మర్చిపోలేని మధుర  స్మృతులున్నాయి. మధుసూదన రావు గారు లైబ్రేరియన్ గా ఉన్నపుడు శాఖా గ్రంథాలయం అరండల్ పేటలో పాత LIC ఆఫీసు పక్కన ఉన్న ఒక పెద్ద ఇంట్లో ఉండేది. మునిసిపల్ హై స్కూల్లో ఏ పాటి గ్రంథాలయాలుంటాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మేము వారంలో రెండు మూడు సార్లన్నా లైబ్రరీకి వెళ్ళి సాధారణ పరిజ్ఞాన సముపార్జన చేస్తుండేవాళ్లం! స్కూల్లో ఖాళీ పీరియడ్స్ లో అలా వెళ్లడానికి మాకు పర్మిషనుండేది.


ఈ టపా ఇప్పుడు రాయడానికి కూడా కారణం ఉంది. నవంబరు 14 నుంచి 19 వరకూ  జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి.అప్పుడు మా శాఖా గ్రంథాలయంలో అన్ని స్కూళ్లకీ వక్తృత్వం, వ్యాస రచన, సంగీతం,క్విజ్, గ్రూప్ డిస్కషన్ లాంటి బోలెడు పోటీలు పెట్టేవారు. మా స్కూలు నుంచి మేము ఒక గంప పట్టుకెళ్ళి గంప నిండా అన్ని స్కూళ్ళనీ చిత్తుగా ఓడించి గెల్చుకున్న బహుమతులూ, మెమెంటోలూ వేసుకుని స్కూలుకు తిరిగొచ్చేవాళ్ళం! (మల్లిక్ రాసిన సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథ గుర్తుందా? అందులో హీరోలాగా అన్నమాట)



విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, యోజన వంటి పత్రికలని జాగ్రత్తగా అట్టలు వేసి మరీ ఉంచేవాళ్ళు. రోజూ ఇక్కడికొచ్చి గంటలతరబడి చదివి గ్రూప్స్ కొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని లైబ్రేరియన్ గారే స్వయంగా చెప్పారు.జర్నలిజం చదివేటపుడు ఒక ప్రాజెక్టు కోసం నేను నెల రోజుల పాటు రోజూ ఇక్కడికొచ్చేదాన్ని ప్రాజెక్ట్ కోసం నోట్సు రాసుకోడానికి. అప్పటి లైబ్రేరియన్ శ్రీ మదార్ ఎక్కడెక్కడి పాత పేపర్లు, పుస్తకాలూ తీయించి నాకెంతో  సహాయం చేశారు. నా ప్రాజెక్ట్ "ముందుమాట"లో మదార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలుంటాయి.

నా స్కూలు రోజుల్లో  ఉదయం, సాయంత్రం పేపర్లు  చదవడానికొచ్చే రిటైర్డ్ ఉద్యోగుల ,కాలేజీ విద్యార్థుల  సైకిళ్లతో లైబ్రరీ ముందు రోడ్డంతా నిండిపోయి ఉండేది.ఇంతమంది లైబ్రరీలో గడపడానికి కారణం అప్పట్లో టీవీ వేయి తలల విషనాగులా ఇంతగా విజృంభించకపోవడమే అనుకుంటాను!


లైబ్రరీ ముందు ఉన్న విశాలమైన అరుగుల మీద కూచుని పిచ్చాపాటీ మాట్లాడుకునే వాళ్ళూ, అక్కడినుంచి నాలుగడుగులు ముందుకేసి స్టేషన్ రోడ్డులో శంకరమఠం దాకా వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్లూ...ఆ వాతావరణమే విజ్ఞానంతో నిండి పవిత్రంగా ఉండేది. పోటీ పరీక్షల కోసం చదవడానికొచ్చే వాళ్ళకు అనుభవజ్ఞుల సలహాలు కూడా ఆప్యాయంగా  లభిస్తుండేవి.




కాలేజీకి వెళ్ళాక శాఖా గ్రంధాలయానికి రావడం తగ్గింది. ఎందుకంటే మా కాలేజీకి గుంటూరు జిల్లాలో ఏ కాలేజీకీ లేనంత  పెద్ద లైబ్రరీ ఉంది.(ఇప్పటికీ)!

కొన్నాళ్ళకి లైబ్రరీ ని అక్కడినుంచి పాత LIC ఆఫీసు పై భాగంలోకి తరలించారు. మరి కొన్నాళ్ళకి అక్కడినుంచి ఆంధ్రా బాంక్ సెల్లార్ లో ఉంచారు. అంత పెద్ద లైబ్రరీని ఎలా తరలించగలిగారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మా వూరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దాదాపు 30 పుస్తక కేంద్రాలు ఉన్నాయి. వీటికి నెలకు యాభై పుస్తకాలు వాళ్ళకు ఇస్తుంది  శాఖా గ్రంథాలయం! రోజుకు మూడు వార్తా పత్రికలు వేయిస్తుంది. నెల తర్వాత వాళ్ళు వచ్చి పాత పుస్తకాలు ఇచ్చేసి మరో యాభై పుస్తకాలు పట్టుకెళతారు. ఇలాంటి ఒక పుస్తక కేంద్రం నరసరావుపేట సబ్ జైలులో ఖైదీల కోసం ఉందని తెలిసి ఎంతో సంతోషం వేసింది.

ఇవి కాకుండా పదో పన్నెండో  గ్రామీణ గ్రంథాలయాలు కూడా ఈ శాఖా గ్రంథాలయ నిర్వహణలోనే పని
చేస్తాయి.వాటికి స్వంతగా పుస్తకాలున్నా, పర్యవేక్షణ  అంతా ఇక్కడినుంచే! 

ఖైదీలు పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుతారనీ,ఫలానా పుస్తకాలు కావాలని అడుగుతారనీ లైబ్రేరియన్ చెప్పారు.

ఊరు మారేవారో, విదేశాలు వెళ్ళేవారో తమ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకెళ్లలేమనుకుంటే శాఖా గ్రంథాలయానికి ఇచ్చేవేయవచ్చు! అక్కడ సబ్జెక్టు వారీగా సీరియల్ నంబర్లు వేసి అందరికీ అందుబాటులో ఉంచుతారు.

చివరగా వస్తూ వస్తూ బిల్డింగ్ పేరు చూసి "ఎమ్మెల్యే గారేమన్నా విరాళం ఇచ్చారేమో బిల్డింగ్ కి" అనుకున్నా! లైబ్రేరియన్ గారిని అడిగితే ఆయన , క్లర్కూ  మొహాలు చూసుకుని "లేదమ్మా, అంతా జి.గ్రం.సం. (జిల్లా గ్రంథాలయ సంస్థ) నిధులతోనే కట్టారు ఈ భవనం"అని చెప్పారు. "మరి ఆ పేరేంటి?" అనడిగితే అక్కడే పుస్తకాలు చూస్తోన్న ఒక సీనియర్ చదువరి...

"నీటిపారుదల ప్రాజెక్టులకు వై యెస్ పేరు పెడితే ఆ ప్రాజెక్టుల డబ్బంతా ఆయన జేబులోంచి పెట్టినట్లేనా? ఇదీ అంతే! వాళ్ల ప్రభుత్వం ఉన్నన్నాళ్ళూ వాళ్ళ తాతల పేర్లు పెట్టుకున్నా అడిగేవాడు లేడు"అని దేవరహస్యం చెప్పేశాడు.అన్నట్లు ఇక్కడ రీడింగ్ హాల్ పేరు కూడా దివంగత ముఖ్యమంత్రి గారిదే!

ఇదీ మా లైబ్రరీ కథ! ఇంతా చేసి ఈ ఏడాది ప్రభుత్వం గ్రంథాలయ వారోత్సవాలను జరపకూడదని నిశ్చయించిందట!  :-(

Wednesday, August 12, 2009

సత్యనారాయణా టాకీసులో కాంతారావు సినిమా...

"సినేమా సూడాలంటే సత్తెనారాయనా టాకీసే, మాంచుషార్రావలంటే కాంతారావు సినేమానే!" సత్తి, సత్తి పండు, ఉరఫ్ జేవీ సత్యనారాయణా, ఇంకో ఫ్రెండు అనేవాళ్ళు. మరి అంత బావుంటాయా? అని ఆలోచిస్తే నాకు ఒకసారి సినిమా చూస్తే పోలా  అనిపించింది. మరి కాంతారావు సినిమాలెక్కడ వస్తాయి? ఇంతకీ అవి ఎలాంటి సినిమాలు? మాంఛి ఫైటింగులుంటాయా? హుషారైన పాటలుంటాయా? ఉన్నాయి సరే! మరి ఎవరినడిగితే నన్నా సినిమాకి తీసుకుని వెళ్తారు?

ఇంతకీ ఆ కాంతారావెవరు? అదో డౌట్. మనకి సినిమా అంటే సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, అమితాబూనూ. మరి ఈయనెవరు? కొంచం పాతోళ్ళైతే ఎన్టీయార్, తెలుసు. దాన వీర శూర కర్ణ చూసి తల బద్దలు కొట్టుకున్న అనుభవం ఉంది. నాలుగ్గంటల సినిమా కదా. హ్హుఁ!  హుషారైన సినిమా అనగానే నాకు కళ్ళూరాయి. చూద్దామని.

"ఈసారి ఆ కాంతారావు సినిమా వస్తే నాకు కూడా చెప్పండ్రా. నేనూ వస్తాను," అన్నాను. "చెప్పేదేముందిరా. మీ ఇంటికి వెళ్ళేదారిలోనే బొమ్మ పెడతాడు. చూసి చెప్పు. అందరం వెళ్దాం," అన్నాడు సత్తి గాడు. "అందరం. హేమిటి వెళ్ళేది? మా మురళీబాబు చక్కగా బయట ఫ్రెండ్స్ తోనే ఆడుకోనివ్వడు. ఆయన బాధ తట్టుకోలేక నాన్న దగ్గర మొరబెట్టుకుంటే నాన్నే నాతో ఆడటం మొదలెట్టాడు. ఇక సినిమాలుకూడానా ఫ్రెండ్సుతో. ఐనా నా పిచ్చిగానీ..." అనుకున్నా మనసులో కసిగా. అతడులో కాలుజారి పడే సీను ముందు త్రిషా లాగా. దాన్నే అసూయ అంటారని మొన్నామధ్యే తెలిసింది. అనంతరామ శర్మ
 
 గారి వల్ల. కానీ అదంటే ఏంటో నాకింతవరకూ పూర్తిగా అర్థంకాలేదు. ఎందుకు కలుగుతుందో.

అప్పట్లో నేను నాలుగో క్లాసు. శర్మా ట్యుటోరియల్స్ లో చదువు. అది సరిగ్గా పట్టాభిరామస్వామి గుడి ఎదురుగా ఉండేది. అక్కడినుంచీ పడమర ముఖంగా నడుచుకుంటూ వస్తే మాఇల్లు. అది పాతూరు ఆంజనేయస్వామి గుడి నుంచీ అదే లైనులో ఓ వంద గజాల దూరంలో ఉండేది. అలా బడి నుంచీ గుడి వరకూ వచ్చేలోపుల మధ్యలో ఒక చౌరాస్తా దాటితే అక్కడే కుడిచేతి వైపున ఉన్న పాండురంగ స్వామి గుడి పక్కనే ఉన్న గోడ మీద సినిమా పోస్టర్లుండేవి. వాటిలో సత్యనారాయణా టాకీసువి పై వరసలో మధ్యలో (అంటే నేను బడి నుంచీ గుడి వైపు వెళ్ళే వైపునుంచీ రెండోది)  వేసేవాళ్ళు.  అలా మొత్తం సర్వే చేసి ఇక ఈసారి కాంతారావు సినిమా వస్తే వదిలేది లేదని మంగమ్మ శపథం చేశాను. ఇప్పుడైతే నేను పిల్లగాడిని గానీ, అప్పటికింకా పిలగాడినేగా. అందుకే శపథం అంటే అదేదో హీరోగారే చేసుంటారని గుడ్డి నమ్మకం. అందుకే మంగమ్మ శపథం అంటే అదేదో హీరోనే చేసుంటాడులే అనే ధైర్యంతో.

ఇంటికెళ్ళాక కుమారి పిన్నినడిగాను. కాంతారావంటే ఎవరు? అని. "మొన్న మనం ’పెళ్ళి కాని పిల్లలు’ సినిమా చూశామే. అందులో విలను," అంది.

" ఛీ! విలనా? వీళ్ళకి విలను సినిమాలు చూస్తారా?" అనుకుని చిరాకు పడ్డాను. తెల్లారాక బళ్ళో వాడిని నిలదీశాను. వాడు విలను కదరా అని.  వాడు నన్ను కన్విన్స్ చేయాలని చూసినా నేను వినలేదు. అట్టాంటి సినిమాలు చూసి చెడిపోవద్దు (అంటే నాకు తెలియదు. మురళీబాబు వాడే మాట అది. ఫ్రెండ్స్ తో తిరిగితే చెడిపోతారని. మరి తిరక్కుండా కూచుంటే చెడిపోరా అని ఒక సారి అడిగిన పాపానికి తొడపాశం పెట్టాడు). మంచి హీరోల సినిమాలు చూడటం నేర్చుకోమని ఉపదేశామృతం ఒలికించాను. ఇక లాభంలేదనుకున్నాడో లేకపోతే, నన్ను అఙ్ఞాన తిమిరాంధకారం నుండీ విముక్తుణ్ణి  చేయాలని సంకల్పించాడో గానీ. "ఉరే! సత్తె పెమాణకంగా సరస్పత్తేవి మీద ఉట్టేసి చెప్తున్నాను. వాడి సినేమాలు చాలా బావుంటాయిరా. ఒకసారి చూసి బావోపోతే నాకు చెప్పు." అన్నాడు. సరే! క్షమించాను ప్ఫో! అన్నట్టో ఎక్స్ ప్రెషనిచ్చి ఊరుకున్నా.

అప్పటినుంచీ రోజూ ఆ ప్లేసులో కాంతారావు సినిమా ఎప్పుడొస్తుందా అని చూట్టం అలవాటయిపోయింది. ఇగో చెప్పటం మర్చిపోయాను. ఆ చౌరాస్తానుంచీ (బడి నుంచీ గుడి కెళ్ళే లాగా ఐతే) ఎడమ వైపు నేరుగా వెళ్తే శివుడి బొమ్మ వస్తుంది. (బొమ్మ ప్రక్కనే ఉంది చూడండి). ఆ శివుడి బొమ్మ నుంచీ పడమర వైపు ఓ యాభై గజాల్లోపే గడియారస్థంభం ఉండేది. (గడియారస్థంభం
 
 గురించి గత టపాలో సృజన వ్రాసింది). అలా ఓ పదిరోజులు గడిచాయో లేదో కానీ వస్తాడు నీరాజు ఈరోజు అనేలా ఒక శుభశకునం ఎదురైంది. పొద్దున్నే రేడియోలో అదే పాట వచ్చింది. నేను యాజ్యూజువల్‍గా కుడివైపోలుక్కిచ్చాను. చిత్రం. ’ప్రతిఙ్ఞా పాలన’ అనే సినిమా పోస్టరు కనిపించింది. దాన్లో ఒకణ్ణి చూసి ఎక్కడో చూశానే అనిపించి తేరిపార (అబ్బ! గడ్డపార కాదు) చూడగా వాడెవరో కాదు. కాంతారావే. ఇంకేముంది? "గాల్లో తేలినట్టుందే... గుండె జారినట్టుందే..." అని ఎగురుకుంటూ బడికి పరిగెత్తాను. (మనలోమాట. ఆ పాటని మొదట నేనే పాడాను. జల్సాలో ఆ పాట రాసినోడు ఎక్కడో అక్కడే నక్కి విని ఇన్నాళ్ళకి దాన్ని మక్కికి మక్కీ దింపేశాడు ;-) ఎవరికీ చెప్పకండేఁ...)


 

సత్తిగాడికి విషయం చెప్పేశాను. వాడు నేను ఈ సాయంత్రమే వెళ్తానన్నాడు. నాకూ ఆత్రం పెరిగిపోయింది. ఎలాగైనా ఆ సినిమా చూడాల్సిందే. అనుకున్నా. సాయంత్రం ఇంటికెళ్ళాగానే బుద్ధిగా హోంవర్కు చేసేసి, (మామూలుగా నేను నా స్కూలు చదువు మొత్తం మీద ఓ పదిసార్లు చేసుంటాను. నాన్నో, అక్కో, రమా పిన్నో, ఎప్పుడైనా పనిష్మెంటు క్రింద అమ్మో చేసి తరించేవాళ్ళు. కుమారి పిన్ని చేయదు. నాకన్నా బద్ధకం. మురళీబాబు తాట తీస్తాడు. హోంవర్కు) నాన్నకి అర్జీ పెట్టుకున్నా. "ముందు హోమ్వర్కు తీసుకునిరా. అదవగానే ఆలోచిద్దాము." అన్నాడు. "నాన్నా. నేను మొత్తం చేసేశా నాన్నా." అన్నా. ఇక సినిమా ఖాయం అనే ధైర్యంలో. కానీ ఆ మాటలు విందో లేదో రమా పిన్ని ఢామ్మని క్రింద పడిపోయింది. అటే వస్తున్న బుచ్చిమామ నోరెళ్ళ బెట్టి నీలుక్కుని పోయాడు. ఇంత హడావిడి ఏమైందబ్బా అని వస్తూ అమ్మమ్మ (కుమారి పిన్నీ వాళ్ళా అమ్మ. అమ్మా వాళ్ళా అమ్మని పెద్దమ్మమ్మ అంటాను) క్రింద పడ్డా రమా పిన్ని కాలు తగిలి భూగోళాం బద్దలయ్యేలా పడి "నాయనోయ్!" అని శోకాలు.

ఇంకేముంది. ఆరోజంతా ఈ గోలే.
*** *** ***

ఇక సినిమా కాస్తా గోవిందా గోవిందా (ఆర్జీవీ సినిమా కాదు) అనుకుని నన్ను నేనే తిట్టుకున్నాను. "నాన్నా! నువ్వు హోమ్వర్కు చేశావు సరే. అసలే బలహీనమైన గుండెలున్న మన ఇంట్లో చేసినవాడివి నాన్న చెవిలో చెప్పాలిగానీ అలా పెద్ద ఘనకార్యంలా డిక్లేర్ చేస్తే ఎలా? ఫో! ఇక ముందైనా సరిగా ఉండు. అతిగా ఆవేశ పడే ఆడదీ, అతిగా ఆశ పడే మగవాడూ, బాగు పడ్డట్టు చరిత్రలో ఎక్కడా చెప్పబడలేదు" అని నన్ను నేను తిట్టుకుంటూనే ఉన్నాను. (ఈ డైలాగూ నాదే. కాపీకరించారు). పనిష్మెంటు క్రింద నేను ఆ మర్నాడు కూడా స్వయంగా హోమ్వర్కు చేశాను. కానీ ఈసారి ఎవరికీ చెప్పలేదు.

విషయం తెలిసిన మురళీబాబు, వీణ్ణి ఇలాగే కాస్త ఎంకరేజ్ చేస్తే హోమ్వర్కు ఎవరిచేతో చేయించకుండా వీడే చేస్తాడని భ్రమ పడి ఆ మర్నాడే మ్యాట్నీకి తీసుకెళ్ళాడు. ( ఆదివారం కదా!) . తెర మీద కాంతారావు పేరు చూసి ఆనందం పట్టలేక మనసులోనే విజిల్స్ వేసుకుని (పైకేస్తే ’ఇచట తాట తీయబడును’ అని మురళీ బాబు పెట్టిన బోర్డు... హిహిహి.)... అదీ సంగతి.

కత్తి యుద్ధాలూ, గుర్రాలూ, ఇంకేం? మనకి కావాల్సిన మసాలా అంతా ఉంటంతో నాకు కాంతారావు సినిమాలూ, వాటిని తీసుకొచ్చినందుకు సత్యనారాయణా టాకీసూ భలే నచ్చేశాయి. అలా మొదలైన నా అనుబంధం, పాతాళ భైరవీ, మిస్సమ్మ, నర్తనశాలా, త్యాగయ్య, అల్లూరి సీతా రామ రాజు, భూలోకంలో యమలోకం, గురువుని మించిన శిష్యుడు, తరువాత్తరువాత జురాసిక్ పార్కూ, అనకొండా... ఓ వంద పైన సినిమాలు (అందులో సగం జానపదాలే!) అక్కడే చూశాను. నా చిన్న తనపు సినిమాలు, నేను నేర్చుకున్న కథలూ, ఎన్నో ఆ సత్యనారాయణా టాకీసు మహిమే. పుస్తకాల సంగతి వేరే అనుకోండీ.

ఆ సంగతులన్నీ వీలుననుసరించి.
*** *** ***

ఇప్పుడా సత్యనారాయణా టాకీసు బొమ్మ పెట్టాలన్నా దొరకటం లేదు. ఇందాకే మన బ్లాగు టీచరమ్మ సుజాత గారి నడిగి, బాధపడ్డాము. ఆ హాలుని పడగొట్టి హాస్పిటలు కట్టారు.

అలాగే, మాకెంతో ఇష్టమైన ’నరసరావుపేట్రియాటిక్ ఐఫిల్ టవర్’ గడియారస్థంభం కూడా లేదిప్పుడు. మనసంతా ఏదోలా అయిపోతుంది. మా సత్తిగాడిని చూసి చాలా రోజులైంది గానీ, వాణ్ణి తల్చుకున్నప్పుడల్లా ఆ హాలే గుర్తొస్తుంది.

ఎంతైనా మా పేటోళ్ళవి తొడగొట్టే వంశాలే కాదు. పడగొట్టే వంశాలు కూడా.

పీయెస్: ఆ తరువాత మరో ఐదేళ్ళు నేను హోమ్వర్కు చేయలేదు. నేను చేసే రకం కాదు. చేయించే రకం. ;-)

Saturday, June 27, 2009

గడియార స్థంభం -సృజన మధుర జ్ఞాపకం!

నరసరావు పేటలో ఊరి మధ్యలో గడియారం స్థంభం ఉండేది. అదొక పెద్ద లాండ్ మార్క్. దాని ఎదురుగా పర్మినెంట్ చలివేంద్రం ఉండేది డయాగ్నల్ గా! గడియారం స్థభం కి చుట్టూ అనేక హోటళ్ళు.ఒకవైపు చాకలి స్లోపు(అదొక సందు అంతే! దాన్ని స్లోపు అని ఎందుకంటారో నాకు తెలీదు)40 ఏళ్ళబట్టీ ఉన్న స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పుస్తకాల షాపు ఇంకా అక్కడే ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ మధ్య! మరో పక్క మునిసిపల్ ఆఫీసుకువెళ్ళే దారి. ఎడమవైపు ఒరవకట్ట(ముస్లిములుండే ప్రాంతం)కి వెళ్ళే దారి మసీదు సందుతో ప్రారంభం అవుతుంది. వెనకగా శివుడి బొమ్మ సెంటరు.(ఇదివరలో దీన్ని గాంధీ చౌక్ అనేవారు.శివుడొచ్చాక గాంధీని పట్టించుకోడం మానేశారు అంతా).


ఈ మధ్య ఏడాది క్రితం వెళ్ళినపుడు అక్కడ అంతా బోసిగా ఉంది. ఆ ప్రాంతం అంతా సైకిళ్ళు,స్కూటర్లు, రిక్షాలు, ఆటోలు పార్క్ చేసి ఉన్నాయి.మధ్యలో గడియారం స్థంభం మాత్రం లేదు. నిట్టనిలువునా కూల్చేశారట. చెప్పలేనంత బాధ వేసింది.ఎందుకు కూల్చారో, ఎవరు కూల్చారో గానీ వాళ్లకు కలిసొచ్చిన స్థలమేదీ లేదు, ఒక మధుర జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం తప్పించి. ఆ స్థంభంతో, మా వూరితో సృజన గీతం సృజనా రామానుజన్ అనుబంధం ఇదిగో....!

గడియార స్థంభం - ఒక ఙ్ఞాపకం

మా నాన్నగారు ఒకసారి ఊరికి వెళ్ళాలంటే నేను వెంటా పడ్డాను. నాకు అప్పుడు ఆరేళ్ళుంటాయి. ఇంట్లో నాయనమ్మ, అన్నయ్యా ఉన్నా ఎందుకో నాకు అప్పుడు నాన్న వెళ్తుంటే దిగులుగా అనిపించింది. సరే అని నాన్న నన్ను కూడా తీసుకెళ్తానన్నారు. వెళ్ళేది ఏ ఊరో కూడా తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంఛే దూర ప్రయాణాలంటే చాలా ఇష్టం. అందులోనూ రైల్లో సింగిల్ సీటు ఉన్న వైపు కూఛోడం చాలా బాగుంటుంది ఇప్పటికీ.


సగం దూరం వెళ్ళాక తెలిసిమ్ది నాకు వేళ్ళేది నరసరావుపేట అనే ఊరికి అని.


"నాన్నా! ఆ ఊరు పెద్దదా?" అడిగాను. "లేదమ్మా చిన్న ఊరే," న్నారు. కొంచం ఆశ్చర్యపోయాను. "చిన్నదంటే ఎంత ఊరు నాన్నా? మన ఇల్లంత ఉంటుందా?" అని అడిగా. దానికి నాన్న నవ్వి, చూద్దువు." అన్నారు.


ఒక చిన్న ఊరంటే ఎంతుంటుందబ్బా అనుకుంటూ నాన్న ఇచ్చిన బొమ్మల పుస్తకం తీసుకుని చదూకుంటూ కూచున్నాను. మొత్తానికీ నా నిరీక్షణ ఫలించి ఎలాగోలా సాయంత్రానికి ఆ ఊరు చేరాం. మా ఇల్లంత చిన్నది కాక పోయినా మా వైజాగు కన్నా ఖచ్చితంగా చిన్నదే అని ఆ రైల్వే స్టేషన్ చూసి అర్థం అయింది.


నాన్న స్నేహితుడైన శర్మ గారింటికి వెళ్ళే దారిలో నాను జాగ్రత్తగా అన్నీ పరిశీలిస్తుంటే నాకో పేద్ధ భవంతి కనబడింది. అదేంటో కనుక్కుందామని నాన్నని అడిగితే దాన్నే గడియారస్థంభం అంటారని, ఆ ఊళ్ళో ఒక ల్యాండ్ మార్కని చెప్పారు. అదెందుకో పొడుగ్గా ఉండి నాకు కాస్త నచ్చింది.


అక్కడ శర్మగారి పిల్లలతో ఆ రోజుకి ఆడుకున్నా. మర్నాడు వాళ్ళ అమ్మాయితో స్కూలుకి కూడా వెళ్ళాను. సాయంత్రం రాగానే నన్ను ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి చూపించమన్నాను. అంతకు ముందు నేను నాన్న తో చెన్నై, బాంబే వెళ్ళి ఉన్నాను. అలాగే ఈ ఊళ్ళో కూడా బీచి ఉంటే చూపించమన్నాను. శర్మ గారు నవ్వి, మా ఊళ్ళో బీచి లేదు కానీ మనందరం కాసేపు బజారుకెళ్ళి ఏమన్నా కొనుక్కుందాం అని అన్నారు.


ముందు అందరం కలసి ఏదో పార్కుకి వెళ్ళాము. నాకది అంతగా నచ్చలేదు. వీజీపీ గోల్డన్ బీచి, వైజాగు బీచీ చూసిన నాకు అది పెద్ద గొప్పగా అనిపించలేదు కానీ చాలా మంది పిల్లలు అక్కడ హుషారుగా ఆడుకుంటూ కనిపించారు.


అక్కడి నుంచీ ఒక షాపులోకి వెళ్ళాం. అక్కడ కొన్ని బొమ్మలు చూశాం. శర్మగారు, "చందూ (రామచంద్రాచార్యులు), అమ్మలుకి నేను బొమ్మ కొనిపెడతాను. నువ్వు కాదంటే ఒప్పుకోను ," అన్నారు.


ఈ అమ్మలూ తుమ్మలూ నాకు నచ్చవు స్వామీ అందామనుకున్నా ఏదో పాపం బొమ్మ కొనిపెడతానన్నారు కనుక అలా క్షమించేశాను. అక్కడ కొన్న బొమ్మ ఒక కుందేలు, దాని వీపు మీద పిల్ల. నాకది భలే నచ్చింది. తల్లి కుందేలు, పిల్ల కుందేలు. భలే అనుకున్నాను. అందుకే నాకు బాగా నచ్చిందేమో!

దాన్ని గట్టిగా పట్టుకుని నాన్న భుజానెక్కి నేను సగర్వంగా అలా వాళ్ళతో మళ్ళా ఆ గడియారపు స్థంభం సెంటరుకి వెళ్ళాను. "మీ ఊళ్ళో పెద్ద పెద్ద బిల్డింగులు లేవేంటీ?" అన్నా. "మాది చిన్న ఊరుకదమ్మా. అందుకే చిన్న చిన్న బిల్డింగులే ఉంటాయి," అన్నారు శర్మగారు.


"సృజీ, మీది పెద్ద ఊరా?" అడిగింది స్వప్న. శర్మగారమ్మాయి. "అవును," అన్నా గర్వంగా. "అంటే మా ఇల్లంత ఉంటుందా?" అందా అమ్మాయి ఆశ్చర్యంగా. నాన్న పెద్దగా నవ్వారు. నా ప్రశ్న గుర్తొచ్చి.


"ఇదిగో గడియార స్థంభం సెంటరు. ఇక్కడ బేకరీలో ఏదన్నా తింటావా?" అన్నారు శర్మగారు. కానీ నేను ఆ గడియార స్థంభాన్నే తదేకంగా చూస్తూ నించున్నాను. "నాన్నా! నన్నక్కడ ఫొటో తియ్యవా?" అడిగాను. నాన్న కెమేరా బయటకి తీసి నన్ను తీసుకెళ్ళి అక్కడ నించో పెట్టి ముందు స్వప్నతో, తరువాత సింగిల్ గా రెండు శ్నాప్స్ తీశారు.


"ఏంటా పోజు? నువ్వేమన్నా విక్టోరియా మహారాణివనుకుంటున్నావా?" శర్మగారు నవ్వుతూ అన్నారు ఫొటో అయ్యాక.


"అవును. తను నా లిటిల్ ప్రిన్సెస్," నాన్న అన్నారు.


ఆ రాత్రికే మా ప్రయాణం వైజాగుకి. ఇప్పటికీ ఆ బొమ్మ ఉంది నా దగ్గర. అలాగే అక్కడ తీసిన ఫొటో గురించి!!!


ఆ పోటో ఒక రకంగా ఉండేది. ఆ లైటింగు ఎఫెక్టుని నాన్న ఎలా తీసుకొచ్చారో తెలీదు కానీ చాలా స్టైలిష్ గా, నేను తల ఎత్తుకుని ఇచ్చిన పోజుని బాగా కాప్చర్ చేశారు. అది రెండు కాపీలుండేవి.ఒకటి ఇప్పటికీ నాన్న డెస్క్ మీద ఫ్రేములో భద్రంగా ఉండగా మరొకటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో పోయింది. అది ఎప్పుడూ నా పుస్తకాల్లో ఉండేది. నేను ఇంటర్మీడియేట్ లో హాస్టల్ లో ఉన్నా కొన్నాళ్ళు. ఒకబ్బాయి నేను ఐలవ్యూ చెప్పలేదని ఫస్టియర్ పరీక్షల ముందు నా పుస్తకాల్ని సైడు కెనాల్లో పడేశాడు. మాథ్స్ నోట్స్ లో ఉన్న ఆ ఫోటో నాకు కాకుండా పోయింది.


నాకైతే చాలా బాధనిపించింది. ఎప్పుడన్నా గుర్తొస్తే బాధగా ఉంటుంది. నాన్నకి బాగా నచ్చిన ఫొటో అది. నా వెనుక గడియారస్థంభం బ్యాక్ గ్రౌండ్.


ఈ మధ్య చంటి నన్ను ఆ ఫొటో కాపీ అడిగాడు. నాన్న నవ్వుతూనే దాన్ని ఇవ్వనన్నారు. బయటకు తీస్తే పోతుందని. "ఫొటో నా దగ్గర ఫిజికల్ గా ఉండకపోవచ్చు కానీ దాన్ని చూసిన అనుభూతి చెరిగిపోదు లెండి," అన్నాడు.


నాకూ అనిపించింది. అవును ఆ ఫొటో నా దగ్గర లేదు కానీ ఆ ఙ్ఞాపకం ఎప్పుడూ నాతోనే ఉంటుంది కద. :-)


అదండి. నా నరసరావుపేట గడియారస్థంభం ఙ్ఞాపకం. ఎందుకో చిన్న ఊరే కానీ, నాకు బాగానే నచ్చింది. ఎక్కువ దూరం వెళ్ళాకుండానే అన్నీ దొరుకుతాయని, నీటి సౌకర్యం ఎక్కువనీ, వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందనీ, శర్మగారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేటప్పుడు నాన్నతో అన్నారట.


ఈ మధ్య ఈ పేట్రియాట్స్ చదివాక, నాకు ఆ చిన్ననాటి ఙ్ఞాపకం గుర్తొచ్చింది. నా అనుభూతినీ పంచుకుందామనీ.

***

Tuesday, June 9, 2009

రాజావారి కోట !

నరసరావు పేట రాజాగారి కోటకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పుడు లేవు కానీ 2, 3 దశాబ్దాల క్రితం కోట శిధిలాలన్నీ చరిత్రకు మౌన సాక్షులుగా నిలబడి ఉండేవి. నరసరావు పేట కు ముందు ఉన్న పేరు అట్లూరు. ఆ తర్వాత ఈ వూరి జమీందారు కోట నిర్మాణం తర్వాత రావు బహద్దూరు వెంకట గుండా రాయణం గారు తమ తండ్రి గారి పేరిట "నరసింహా రావు పేట" అని నామకరణం చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా అది "నరసరావుపేట" గా మారింది.

కోట ఉన్న ప్రాంతాన్ని ఈ రోజుకీ "రాజాగారికోట" అనే పిలుస్తారు గానీ ఆ ప్రాంతానికి ఒక పేరంటూ లేదు. జమీందారు వారసులు ఈ ప్రాంతాన్ని విడిచి చెన్నై వెళ్ళిపోయాక కోట కాల ప్రభావానికి లోనై కూలిపోయింది. కూలిపోయిన భాగం పోగా మిగిలిన శిధిలాలను కూడా కూలగొట్టి అక్కడ అనేక ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది.డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి కూడా ఇక్కడే ఉన్నది. మొదటగా నిర్మించిన ఆసుపత్రుల్లో ఇదొకటి. అలాగే ఊరిలోని వస్త్ర వ్యాపారులందరినీ ఒకే చోట చేర్చే ఉద్దేశంతో కోట ఆగ్నేయ భాగంలో 114 షాపులతో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రారంభమై, తర్వాత మరింత విస్తరించింది. .ఇదొక పెద్ద వస్త్ర దుకాణాల సముదాయం!

(ఈ వ్యాసం కేవలం కోట నిర్మాణ విశేషాలను వివరించడానికే ఉద్దేశించింది కాబట్టి రాజా వారి వంశ చరిత్రను ఇక్కడ ప్రస్తావించడం లేదు.)  

ఏ ప్రాంతంలోనైనా కోటలు వందల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఎలా నిలిచి ఉంటాయో అని ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది. ఈ కోట నిర్మాణ క్రమాన్ని పరిశీలించినపుడు తగిన కారణాలు కనిపిస్తాయి.
                                           రాజావారి కోట నమూనా చిత్రం

క్రీ.శ.1797 (పింగళి నామ సంవత్సర శ్రావణ  శుద్ధ పంచమి, శుక్రవారం)కోటకు శంకుస్థాపన జరిగింది.చతురస్రాకారంలో 11 ఎకరాల 13 సెంట్ల విస్తీర్ణంలో దుర్గం నిర్మాణాన్ని ప్రారంభించారు.15 అడుగుల వెడల్పున లోతైన పునాదులు తీయించి,గండ శిలలతో,పాటి మట్టితో పునాదులు నిర్మించారు.తడిపిన పాటిమట్టికి పుట్లకొలది నానవేసిన చింతగింజల్ని కలిపి ఏనుగులతో తొక్కించి పునాదుల నుంచి ప్రహరీ గోడల వరకూ నిర్మించారు.ఈ నాలుల్గు కోట గోడలు కింది భాగాన 15 అడుగుల వెడల్పు కల్గి పై భాగానికి వచ్చేసరికి 3 అడుగుల వెడల్పు ఉండే విధంగా 20 అడుగుల ఎత్తుతో నిర్మితమయ్యాయి.ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిలచి ఉన్న ఒకటో రెండో గోడల్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.




కోటకు తూరుపు దిశగా 24 అడుగుల ఎత్తు,16 అడుగుల వెడల్పు గల సింహద్వారాన్ని నిర్మించారు.కోట నిర్మాణం పూర్తి కాగానే పరిసర గ్రామాల్లోని అనేక చేతివృత్తులవారు కోట సమీపంలో స్థిరపడ్డారు.జమీదారు మల్రాజు వెంకట గుండా రాయణిం గారు వారందరికీ ఉచితంగా నివాస స్థలాలు సమకూర్చారు.కోట గోడలపై మొత్తం 5 బురుజులుండేవి.  సాయుధులైన సైనికులు నిరంతరం కాపలా కాస్తుండేవారు. కోట ఉత్తర ప్రహరీ వెలుపల ఏనుగులను నిలిపి ఉంచేవారు. ఆ ప్రాంతానికి ఇప్పటికీ ఏనుగుల బజారు అనే పేరు. అప్పట్లో కాలగతిలో కొన్ని ఏనుగులు మరణించినా, కొత్తగా జీవం పోసుకునే గున్నలతో కలిపి ఎప్పుడూ సంస్థానంలో 99 ఏనుగులే ఉండేవట చిత్రంగా!


పెద్ద చెరువు:
రాజావారి సంస్థానంలోని ఏనుగులు ఈదులాడేందుకు 105 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువునొకదాన్ని రాజా గుండారావు నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా నరసరావు పేటలో నీటి ఎద్దడి ఏర్పడినపుడు అప్పటి పురపాలక సంఘ ఛైర్మన్ శ్రీ రాజా మల్రాజు వెంకట నరసింహా రావు ఆ చెరువును పురపాలక సంఘానికి దానం చేశారు. ఆ తర్వాత  కొన్నాళ్ళకు నీరు లేక చెరువు ఎండిపోవడం వల్ల దీనిలో కళాశాలలు, కాలనీలు,కర్మాగారాలు, గుళ్ళు,  స్కూళ్ళు,హాస్టళ్ళు  వగైరాలు నిర్మించారు. దీనితో ఒక వూరే వెలసినట్లయింది. సత్యనారాయణ టాకీస్(ఇప్పుడు లేదు. దీన్ని కూలగొట్టి ఇక్కడ పువ్వాడ హాస్పిటల్ నిర్మించారు)నుంచి రావిపాడురోడ్డులో ఉన్న రెడ్డి నగర్ వరకు ఈ చెరువు   విస్తరించి నిండుగా నీళ్ళతో (వర్షాలు కురిసినపుడు నీరు పల్నాడు రోడ్డు (NH-9) మీదకు వస్తుండేదట) తొణికిసలాడుతుండేదని ఆ తరం వారు ఇప్పటికీ చెప్తుంటారు.

అద్దాలమేడ:
కోటకు సంబంధించిన మరో విశేషం అద్దాల మేడ. కోటకు వాయవ్య దిశగా 260X190 చదరపు అడుగుల విస్తీర్ణం గల అయిదంతస్థుల రాజ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం గోడల్ని ఇటుకలతో నిర్మించి రాతి సున్నం వెల్ల వేసిన తర్వాత వినూత్న ప్రక్రియ ద్వారా ఈ గోడలు తళ తళ లాడే విధంగా తీర్చి  దిద్దారు. దీనికోసం అతి తెల్లని పలుగురాళ్లను   మెత్తగా పొడి చెసి,అందులో తెల్లని మెత్తని ఇసుకను కలిపి దానిలో లక్షలాది కోడిగుడ్ల తెల్ల సొన సమపాళ్లలో కలిపి జిగురుగా తయారయ్యేవరకు గానుగలతో నూరించేవారు. పాలగచ్చు గా వ్యవహరించే ఈ పదార్థాన్ని గోడలకు మందంగా మెత్తించి, నునుపు వచ్చేదాకా గుండ్రాళ్లతో  రుద్దించేవారు.దానితో రాజభవనం మచ్చలేని అద్దాల వలె తళ తళ లాడుతుండేవి. ఈ మేడలో ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాలను ఆ గోడల్లో చూసుకోగలిగేవారు.అందుకే ఈ భవనాన్ని అద్దాలమేడగా వ్యవహరించేవారు.

ఇవీ ఆనాటి కోట విశేషాలు!  వినుకొండ, బెల్లంకొండ,కొండవీడు దుర్గాల మధ్య గల 420 గ్రామాలకు అథిపతి గా రాజావారు నరసరావుపేటనుంచే పరిపాలన సాగించేవారు.

Tuesday, June 2, 2009

ఎందుకింత పేట్రియాటిజమ్?


"మాస్టర్జీ! నీకెందుకింత పేట్రియాటిజమ్? మందేమన్నా ఓ పేద్ధ సెరిత్ర గానీ ఉన్న ఊరేటీ?" అడిగాడు నా దోస్త్, when we were in degree.

అంటే చరిత్ర ఉన్న ఊరే గొప్పదా? అసలు చరిత్ర అంటే ఏంటి? అయినా ఒక ఊరి గురించి ఇంత అవసరమా?

నేను అతనికి ఇచ్చిన సమాధానం...

"చూడు బ్రదర్! గత చరిత్రని తల్చుకోటం నా నైజం కాదు. చరిత్ర లేందే సృష్టిద్దాం. గత చరిత్రతో మనకి పనేంటి? భవిష్యత్ అంతా మనదే అయినప్పుడు! అంతే."

ఈ సమాధానం నాకో డ్రీమ్ ఫ్రెండ్ ని ఇవ్వగా... నా సమాధానమే నాదీ, నా మిత్రుడిదీ దృక్పథాన్నే మార్చేసి, కాస్త విభిన్నంగా మరింత ఆనందంగా జీవించటం నేర్పింది.

అవును. ఒక ఊరికి ఘనమైన గత చరిత్ర ఉంటేనే గొప్పా? లేందే ఆ ఊరికి ఏ గొప్పతనం లేనట్టా? శ్రీకృష్ణుడు పుట్టక ముందు వ్రేపల్లె కి చరిత్ర ఏముంది? ఆ తరువాతంతా చరిత్రేకదా!

ఏ నేల మీదైనా అచట నడయాడిన జనుల వల్లే కదా చరిత్ర ఏర్పడేది. రామ జన్మ భూమి అయోధ్య అంటాం. అంతలా ఆ కాస్త మట్టి మీద ముద్ర వేశాడు ఆయన.

"రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వారేం సాధించారో కాస్త గుర్తిద్దాం మిత్రామా!" అని సిరివెన్నెల

కురవలేదా ఒక్కడులో?

అందుకే ఆ రోజే నేననుకున్నాను. నాకు వీలైనంతలో నా జన్మ భూమికి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని.

*** *** ***

నరసరావుపేట! మా ఊరు.

మా ఊరివాళ్ళం... ’నరసరావుపేట్రియాట్స్’.

అసలు చరిత్రే లేని ఊరు. ఏ నాటికైనా చరిత్ర సృష్టించే ఊరు. చరిత్ర సృష్టించబోయే ఊరు. ఒక చిన్న పట్తణం. రెండొందలేళ్ళ వయసు అంతే. గుంటూరు నగరం నుంచీ నలభై పైన కిమీ దూరంలో ఉన్న మాకు, దగ్గరలోనే రెండు చరిత్ర ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలున్నాయి.

ఒకటి పలనాడు కాగా, మరోటి కొండవీడు. అయినా వాటిని మించి ఎదిగింది మా ఊరు. ఆవేశాలూ, పౌరుషాలూ వారి సొత్తైతే... ఆలోచన మా సొత్తు. ఒక సారి అక్కడ నివసించిన వాళ్ళు మర్చిపోలేని ఊరు మాది. అందుకు చాలా మందే సాక్ష్యం. ఎవరినైనా ఆదరించి తన అక్కున చేర్చుకునే ’ట్రూలీ కాస్మొపాలిటన్’ టౌన్ మాది.

చరిత్రలూ, వీర గాథలూ లేక పోవచ్చు కానీ దేశంలో ఎవరికీ లేని కొన్నిప్రత్యేకతలున్న ఊరు మాది. అవేంటో మేము మీకు త్వరలోనే ఇక్కడే చెప్తాం. కళలలో మేము ఎవరికీ తీసి పోము. ’రంగస్థలి’ మాకుంది. నాటక కళని సుసంపన్నం చేసేటందుకు. కవులున్నారు, ఆటగాళ్ళున్నారు, సినిమా నటులున్నారు (శకుని మామగా, పాతాళ భైరవిలో రాజుగా, ఇలా ఎన్నో రకాలైన జనరంజకమైన పాత్రలలో జీవించిన సీయస్సార్ ఆంజనేయులు మా ఊరి వాడే).

గుడులున్నాయి, గోపురాలున్నాయి... లిస్టనంతం. కానీ వాటి కన్నా ముఖ్యమైనది ఒకటుంది. అదేదో చిన్నగా తెలుస్తుంది.

"మా ఊరి చరిత్ర, కళా సాంస్కృతిక రీతులూ, కవులు, నటులు, , మరియూ ఇతర ప్రముఖ వ్యక్తులు, ఇలా ఇలా. వీలైతే రాజకీయాల గురించి కూడా!" అని మొదట్లోనే చెప్పినట్టు, సూటిగా సుత్తిలేకుండా, సరదాగా మా ఊరి కథలని ఇక్కడ ఉంచాలని.

సకల సౌకర్యాలూ ఉన్న నగరాలు మనకి అలవిగానివి. మరీ చిన్న చిన్న పల్లెలలో సౌకర్యాలు లేవని ఉండలేము. కానీ మీ ఊరు సరీగ్గా ఎలా ఉండాలో అలాగే అంతలానే ఉండి నాకు బాగా నచ్చింది. After my retirement I want to settle here అని నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్న మాటలు, రెండు ఫర్లాంగుల్లోనే అన్నీ అమరే అవకాశం, మరీ అవసరమైతే ఒక కిమీ పరిథిలోనే హాస్పిటళ్ళతో సహా అన్నీ అందుబాటులో ఉంటే ఎవరికైనా అంతకన్నా ఏమి కావాలి? అదే మా ఊరు నచ్చే వాళ్ళకి అంతలా నచ్చే కారణం.

తెనాలి, మాచర్ల, పొన్నూరు, కారంపూడి, లాంటి చరిత్ర ఉన్న ఊళ్ళ మధ్య, మా ఊరెప్పుడూ తన ఇండివిడ్యువాలిటీని కోల్పోలేదు. తనదైన శైలిలో తలెత్తుకుని సగర్వంగా నిలిచే మా ఊరి గురించి ఎంత చెప్పినా తక్కువే.

*** *** ***

అసలు స్వంత ఊరి గురించి ఇంత అవసరమా?

అవసరమే. ఎందుకంటే... "సొంత ఊరు, కన్న తల్లీ" అనలేదూ పెద్దలు. ఒక మనిషి వ్యక్తిత్వం మీద అతని కుటుంబపు, పెరిగిన పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే అతని సాంస్కృతిక జీవనం మీదా, కొన్ని కొన్ని వ్యక్తిత్వపు పోకడల మీద అతని ఊరి యొక్క ప్రభావం కూడా ఉండొచ్చు. కొన్ని సార్లు తెలియని ప్రభావమేదో ఉండొచ్చు. మరి అలాంటి స్వంత ఊరి గురించి తలచుకోవటం అంటే తన సాంస్కృతిక మూలాలని స్పృశించుకున్నట్టే. అదే మా ప్రయత్నం.

రాష్ట్రానికి ముఖ్య మంత్రిని ఇచ్చిన మా ఊరు ఎందులో తక్కువ?

గీతాచార్య

(నా తరువాతి పోస్టు ’ఆంజనేయ స్వామి గుడి’ కథలు).

నరసరావుపేట్రియాట్స్ - Let's create history.


రాసింది: గీతాచార్య , సమయం: 8:58 AM
Labels: పేట్రియాటిజమ్
23 పలకరింపులు ఇప్పటిదాకా:

Chivukula said...

    chala bagumdi.గత చరిత్రని తల్చుకోటం నా నైజం కాదు. చరిత్ర లేందే సృష్టిద్దాం. గత చరిత్రతో మనకి పనేంటి? భవిష్యత్ అంతా మనదే అయినప్పుడు! baga chepparu. ma tatalu netulu tagaru. ma mutulu vasana chudamdi anikakumda, na venuka emumdi ani kadu na mumdu emi rabothondo chudandi. bhesh

    Chivukula Subrahmanya Sastry.
    June 15, 2009 7:43 PM
సత్య నారాయణ శర్మ said...

    గీతాచార్య గారు,
    మాదీ నరసరావుపెటే. నెను రెడ్డి కాలెజీలో ఇంటరూ, ఎస్ ఎస్ ఎన్ కాలెజీలొ దిగ్రి చదివాను. "ఒక సారి అక్కడ నివసించిన వాళ్ళు మర్చిపోలేని ఊరు మాది". నిజం గా నిజం. Plz continue.
    June 15, 2009 9:05 PM
Chivukula said...

    annattu cheppatam maricha. "We are here with no history. But We are here to create history." abbabbabba okkamaatatho padagottesavabbai.
    June 15, 2009 9:43 PM
కత్తి మహేష్ కుమార్ said...

    హ్మ్ విన్నూత్నమైన ప్రయత్నం. చూద్దాం!
    June 15, 2009 9:45 PM
వేణూ శ్రీకాంత్ said...

    భలే చెప్పారు గీతాచార్య... మీ తరువాత పోస్ట్ కోసం ఎదురుచూస్తూ...
    June 16, 2009 9:09 AM
Dhanaraj Manmadha said...

    వంద కావ్యాలు అక్కర్లేదు. ఒక్క వాక్యంలోనే అభిమానాన్ని చాటావ్.

    చరిత్ర సృష్టిద్దాం. ఒక్క మాట చాలు. అప్పుడూ మాట రాలేదు. ఇది చదివాక ఇప్పుడూ రావటంలేదు. Hats-off bro.

    "తెనాలి, మాచర్ల, పొన్నూరు, కారంపూడి, లాంటి చరిత్ర ఉన్న ఊళ్ళ మధ్య, మా ఊరెప్పుడూ తన ఇండివిడ్యువాలిటీని కోల్పోలేదు. తనదైన శైలిలో తలెత్తుకుని సగర్వంగా నిలిచే మా ఊరి గురించి ఎంత చెప్పినా తక్కువే."

    కేక. మా పల్నాడోళ్ళు చూసి నేర్చుకోవాలి. (అఫ్కోర్స్ నేను పుట్టింది పెదకూరపాడనుకో).

    ॒సుజాత గారు,

    మీరు ప్రెవేటు బాగానే చెప్పినట్టున్నారు!!! :-D బారాయించారు.

    Really a cosmopolitan post.
    June 16, 2009 10:22 AM
Nobody said...

    you both seem to be stunningly aggressive. Read ur respective blogs. Nice. Keep it up.

    స్వంత ఊరి గురించి తలచుకోవటం అంటే తన సాంస్కృతిక మూలాలని స్పృశించుకున్నట్టే. అదే మా ప్రయత్నం.

    Right!

    Narasaraopet is of no interest to me. But the posts are interesting to read.
    June 16, 2009 10:32 AM
సుజాత said...

    గీతాచార్య,
    మంత్రుల్నీ, ముఖ్యమంత్రుల్నీ అందించడం గొప్ప కాదు. అంతకు మించిన కళా సాంస్కృతిక వైభవం,దాన్ని ఈ నాటికీ సజీవంగా నిలుపుకోగలిగి ఉండటం మన వూరి సొంతం, మన సొంతం! అదీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది.అందుకే ఈ పేట్రియాటిజం!
    June 16, 2009 8:58 PM
neelaanchala said...

    అమ్మో, ఇదేమిటి, సుజాతగారు, గీతాచార్య గారు కలిసి బ్లాగా? పైగా ఇద్దరిదీ ఒకటే ఊరు కూడానా? అదీ సంగతి! వెరైటీ గా ఉంది మీ వూరి బ్లాగు. పైన నోబడీ చెప్పినట్లు స్టన్నింగ్లీ అగ్రెసివూ!
    June 16, 2009 9:01 PM
ప్రియ said...

    @గీతాచార్య గారు,

    "నా తరువాతి పోస్టు ’ఆంజనేయ స్వామి గుడి’ కథలు"

    అంటే మీరు ఇప్పట్లో రాయబోరన్నమాట! ;-)

    @సుజాత గారు,

    చాలా మంచి ప్రయత్నం. You both are excellent partners with comparatively different styles. I envy. We Vizag people have such blogs. కాస్త దిష్టి తీయించుకోండి.

    @Dhanaraj Manmadha,

    Good joke! :P

    జనానికి పట్టలేదు కానీ ఎన్నెన్ని వెరైటీలు రాస్తారో మీకు తెలుసా? మీ దోస్తే అంటున్నారు. ఎంతమాటన్నారు? ఆఁయ్య్య్య్య్! It's very difficult to write such a large variety of posts. From movies to sports, stories... read the blog list of him.

    కామెంట్ల కన్నా కంటెంట్ ముఖ్యం అనుకునే అరుదైన బ్లాగర్. పొగడ్త కాదు. నేను చెప్పింది తప్పైతే ఆయనే నా కామెంటుని తీసేస్తారు. Site meters often gives u wrong info.
    June 17, 2009 8:10 AM
ప్రియ said...

    Correction||

    We Vizag people have such blogs. కాదు no such ఉండాలి
    June 17, 2009 8:11 AM
Srujana Ramanujan said...

    "We are here with no history. But We are here to create history."

    Just like you.
    June 17, 2009 8:21 AM
Malakpet Rowdy said...

    Wow somebody from Vizag? Let's start one blog too!
    June 17, 2009 6:55 PM
సుజాత said...

    Malakpet Rowdy,
    How about a blog on "Cheerala"..too?
    June 17, 2009 10:59 PM
Malakpet Rowdy said...

    Well one Cheeraala blog too!
    June 19, 2009 10:09 AM
ప్రియ said...

    ఆంజనేయస్వామి గుడి కథలు గాల్లో కల్సిపోయినాయా మాస్టారూ? ;-)
    July 28, 2009 6:03 AM
సుజాత said...

    ప్రియ,
    రేపే విడుదల! వేచి చూడండి!
    July 28, 2009 9:24 AM
అడ్డ గాడిద (The Ass) said...

    athalu pethliyatijam amthe...

    bagundi kani intha sodi avasarama oka pilla town gurimchi. but any way baga rasharu.
    "స్వంత ఊరి గురించి తలచుకోవటం అంటే తన సాంస్కృతిక మూలాలని స్పృశించుకున్నట్టే. అదే మా ప్రయత్నం."
    Hemito e pichi.
    September 21, 2009 1:24 AM
గీతాచార్య said...

    Dr. Ass,

    Hehehe Super question. I hope u r with no town. Small town? To answer crudely, I can answer that way too, go and ****

    But one thing is sure. you want a different answer, and am not goin' to give it. So, decide yourself
    November 24, 2009 8:58 AM
అడ్డ గాడిద (The Ass) said...

    Thinking u r smart brother, eh? Okay. I agree with ur answer though. I could have mellowed down my question. Hmm
    November 26, 2009 8:45 PM
అర్జున్ ప్రతాపనెని said...

    నమస్తే గీతాచార్య మరియు సూజాత గార్లకు..మీ నర్సారావుపేట ఏందుకు గొప్పది కాదండి మీకు తెలియదనుకుంటా .......
    ఈ రోజు పార్మస్యూటికల్ హొల్ సేల్ వ్యాపారంలో ఆంద్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో ఉందంటే మీరు నమ్ముతారా.....
    ఇలా మీ ఊరికి కూడా ఘనమైన చరిత్ర ఉంటుంది ఇంకా.......
    December 7, 2009 2:35 AM
గీతాచార్య said...

    అర్జున్ ప్రతాపనెని గారు,

    ధన్యవాదాలండీ :-)
    December 10, 2009 11:23 PM
పరుచూరి వంశీ కృష్ణ . said...

    ! గత చరిత్రని తల్చుకోటం నా నైజం కాదు. చరిత్ర లేందే సృష్టిద్దాం. గత చరిత్రతో మనకి పనేంటి? భవిష్యత్ అంతా మనదే అయినప్పుడు! అంతే."
    చాలా బాగుంది అండి మాది కూడా నరసరావు పేట దగ్గరలోనే లెండి .. పల్లెటూరు
    December 18, 2009 8:09 PM
As the post was lost, am reposting this one with retrived comments. Venusrikantha garu sent this one to me. I thank him for his help :-)

Wednesday, May 6, 2009

మా వూరు మాకు గొప్ప!

"జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అని గొప్పగా చెప్పుకోకున్నా, ఎవరు పుట్టి పెరిగిన ఊరు వారికి గొప్పగానే కనపడుతుంది.

అది రాతి నేల అయినా,సస్యశ్యామలమైనా ! (మా ఊరు పచ్చగానే ఉంటుంది).

శాంతి నిలయమైనా, ఫాక్షన్ తీరమైనా! (ఎన్నికలప్పుడు తప్ప ఫాక్షన్ మా ఊరికి రాదు!) .

అలాగే మా ఊరంటే మాకిష్టం! మా ఊరు నరసరావు పేట. ఊరు మారినా ఉనికి మారలేదని, మేమూ మా వూరు గురించి ఒక బ్లాగు రాద్దామనుకుంటున్నాం!

ఊరు గురించి అనగానే ఇదేదో మా ఊరి జనభా లెక్కలూ, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితులూ, పంటల తీరుతెన్నులూ గుర్తొస్తాయేమో! ఇవన్నీ వికీ పీడియాలోనో, ఆంధ్రప్రదేశ్ దర్శిని లోనో దొరుకుతాయి. అదేమీ కాదు. మా ఊరి చరిత్ర, కళా సాంస్కృతిక రీతులూ, కవులు, నటులు, క్రీడాకారులూ, మరియూ ఇతర ప్రముఖ వ్యక్తులు, ఇలా ఇలా. వీలైతే రాజకీయాల గురించి కూడా! ఇవే మేము ప్రస్తావించదల్చుకుంది.

గూగులమ్మని నరసరావు పేట అని అడిగితే "ఈ బ్లాగు చూడండి" అని చెప్పాలని ఆకాంక్షిస్తున్నాం. రోజుకో ఆరేడు టపాలు రాసి ఎవరికీ బోరు కొట్టించం. నెలకు రెండు,కుదిరితే మూడు టపాలు!

మా వూరు పుట్టి రెండు వందల ఏళ్లయిన సందర్భంగా 1997లో ఒక సావనీరు విడుదలైంది. అందులో అరుదైన ఫొటోలు, వ్యాసాలు ఉన్నాయి. మా బ్లాగుకోసం వాటిని కొంతవరకూ వినియోగించుకుంటున్నాం. సావనీరు అప్పటి ఎడిటరు శ్రీ కె.వి.కె రామారావు మరియు ఇతర వ్యాసకర్తలకు మా ధన్యవాదాలు.... !

ఆ ప్రాంతానికి చెందిన ఇతర బ్లాగర్లకు నరసరావుపేటతో ఉన్న బంధాన్నో అనుబంధాన్నో కనీసం పరిచయాన్నో పంచుకోవాలనుకుంటే ఇక్కడ స్వాగతం బోర్డు కడతాం!

ధన్యవాదాలు!


పేట్రియాట్స్


సుజాత,


గీతాచార్య